ర‌ఘురామ‌తో పోటీ ప‌డుతున్న జ‌గ‌న్‌

లేఖ‌లు రాయ‌డంలో న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుతో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోటీ ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రాజ‌ద్రోహం నేరం కింద ర‌ఘురామ అరెస్ట్‌, బెయిల్‌పై విడుద‌లైన త‌ర్వాత వ‌రుస లేఖాస్త్రాల‌ను సంధిస్తున్న సంగ‌తి తెలిసిందే. …

లేఖ‌లు రాయ‌డంలో న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుతో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోటీ ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రాజ‌ద్రోహం నేరం కింద ర‌ఘురామ అరెస్ట్‌, బెయిల్‌పై విడుద‌లైన త‌ర్వాత వ‌రుస లేఖాస్త్రాల‌ను సంధిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

త‌న‌పై భౌతిక‌దాడికి పాల్ప‌డ‌డంపై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, లోక్‌స‌భ స్పీక‌ర్‌, కేంద్ర హోంమంత్రి, ఇత‌ర మంత్రులు, దేశ వ్యాప్తంగా గ‌వ‌ర్న‌ర్లు, ముఖ్య‌మంత్రులు, తోటి ఎంపీల‌కు ర‌ఘురామ‌కృష్ణంరాజు లేఖ‌లు రాసిన సంగ‌తి తెలిసిందే.

అనంత‌రం వైసీపీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చ‌కపోవ‌డంతో పాటు ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై రోజుకొక‌టి చొప్పున ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ర‌ఘురామ‌కృష్ణంరాజు వ‌రుస‌గా లేఖ‌లు రాస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం నెల‌కున్న ప‌రిస్థితుల్లో కేంద్ర ప్ర‌భుత్వానికి, ఇత‌ర‌త్రా వ్య‌వ‌స్థ‌ల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస లేఖ‌లు రాయ‌డం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫిర్యాదు చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. ఆ లేఖలో.. ‘‘ తెలంగాణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా… జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి. 

శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోంది. తాజాగా బుధ‌వారం వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి తెలంగాణ స‌ర్కార్‌పై ప్ర‌ధాని మోడీకి ఫిర్యాదు చేస్తూ ఘాటు లేఖ రాశారు. 

ప‌దేప‌దే జ‌ల‌శ‌క్తిశాఖ‌కు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు ప‌రిష్కారం కావ‌డం లేద‌ని జ‌గ‌న్ వాపోవ‌డం గ‌మ‌నార్హం. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తోంద‌ని, వెంట‌నే ఆపేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న కోర‌డం విశేషం. ఒక‌వైపు తెలంగాణ స‌ర్కార్ ప్రాజెక్టుల్లోని నీటిని తోడేస్తోంద‌ని లేఖ‌ల ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డం త‌ప్ప మ‌రెలాంటి అడ్డుకునే చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.