టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే పర్యటనలు షురూ చేశారు రేవంత్ రెడ్డి. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు లాంటి మీడియా అధినేతలతో పాటు, కాంగ్రెస్ లో కీలకమైన నేతల్ని కూడా కలిశారు. అబ్బ రేవంత్ ఎంత తెలివైన నాయకుడు, ఇలా పదవి రాగానే అలా అందర్నీ కలుపుకొని వెళ్తున్నారు, ఇన్నాళ్లూ ఈయన లాంటి నేతలు ఎక్కడికెళ్లిపోయారు అన్నంత బిల్డప్ ఇచ్చారు.
సహజంగానే మీడియా అధినేతల వార్తలకు సొంత ఛానెల్స్ లో సెల్ఫ్ డబ్బా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పీసీసీ అధ్యక్షుడే నేరుగా వెళ్లి కలిసేసరికి ఆ డబ్బా ఇంకాస్త గట్టిగా వాయించారు, జనాలకు అది బాగా రీచ్ అయింది. అంతమాత్రాన రేవంత్ ఏదో ఇరగదీసేసినట్టు, మాస్టర్ ప్లాన్లు వేసి టీఆర్ఎస్, బీజేపీకి చెమటలు పట్టించేసినట్టు కాదు.
వాస్తవానికి రేవంత్ రెడ్డి కలవాల్సింది వీళ్లను కాదు, చేయాల్సిన పని కూడా ఇది కాదు. పార్టీలో తనకు అసమ్మతిగా ఉన్న వ్యక్తుల్ని ముందు కలుపుకొని వెళ్లాలి. పీసీసీ పీఠానికి రేవంత్ రెడ్డికి చివరి దాకా పోటీ ఇచ్చిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
వాస్తవానికి రేవంత్ తెలివైన నాయకుడే అయితే, అందరి సహకారంతో పార్టీని నడపాలని అనుకుంటే.. ముందుగా కోమటిరెడ్డిని బుజ్జగించాలి. నేరుగా ఆయన్నే కలిసి మీడియా ముందుకొచ్చి చేయీ చేయీ కలిపి ఫోజులివ్వాలి. అదే గనక రేవంత్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది, కార్యకర్తల్లోకి ఓ మంచి సందేశం వెళ్లి ఉండేది.
కదల్లేని స్థితిలో ఉన్న వీహెచ్ ని, పదవులకు రాజీనామా చేయడం తప్ప ఇంకేమీ చేయలేని మర్రి శశిధర్ రెడ్డిని కలిసొచ్చి, అసమ్మతి చల్లారిపోయిందనుకుంటే ఎలా..? మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. అసంతృప్తి ఉన్నా కూడా రేవంత్ తో కలసినడవాల్సిందే. ఎందుకంటే వాళ్లకు తప్పదు. తనకు ముందు నుంచీ మద్దతిస్తున్న సీతక్క లాంటి నేతల్ని కలసి పొగిడించుకున్నా పెద్ద ఉపయోగం లేదు.
అందులోనూ రేవంత్ రెడ్డికి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ అసెంబ్లీలో ఆయనకు స్థానం లేకపోవడం. చట్టసభల్లో టీఆర్ఎస్ ని వేలెత్తి చూపించాలన్నా, నిగ్గదీయాలన్నా ఆయనకు అది సాధ్యం కాకపోవచ్చు. లోక్ సభలో ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండదు. రేవంత్ ఎమ్మెల్యే అయి ఉంటే.. అసెంబ్లీ ఫైట్ ఓ రేంజ్ లో ఉండేది.
తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ చితికిపోయింది. మునిగిపోతున్న నావలా ఉన్న ఇలాంటి టైమ్ లో రేవంత్ రాకతో మిగిలిన పార్టీ కూడా ముక్కలైంది. ముందు దీన్ని చక్కదిద్దాలి. ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని, బయట మీడియా ప్రతినిధుల్ని, మిగతా పెద్ద మనుషుల్ని కలిస్తే ఉపయోగం ఏముంటుంది? ఉత్తమ్ కుమార్ పోయి, ఉత్తర కుమారుడొచ్చాడనే అపప్రథను తొలిగించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే రేవంత్ కు మైలేజీ… ఇమేజీ.. వెయిటేజీ.