మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం మరోసారి చిక్కుల్లో పడింది. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి నకిలీ సర్టిఫికెట్ల తయారీకి పాల్పడి కేసులో ఇరుక్కున్నారు.
కొంత కాలం క్రితం హైదరాబాద్‌లో ఓ భూవ్యవహారంలో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, తమ్ముడు కిడ్నాప్‌నకు పాల్పడడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కొన్ని రోజుల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. దీంతో భూమా కుటుంబ పరువు పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు విఖ్యాత్ మాత్రం తప్పించుకు తిరిగారు. పలు దఫాలుగా న్యాయ స్థానంలో పోరాటం చేయడంతో వాళ్లిద్దరికీ బెయిల్ చిక్కింది. జైలుకు వెళ్లకుండా బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణకు భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్ తమ మార్క్ ఎత్తుగడలు వేశారు.
ఈ నెల 3న కోర్టుకు గైర్హాజరయ్యేందుకు రెండు రోజులు ముందుగా తాము కోవిడ్‌బారిన పడినట్టు సర్టిఫికెట్లు సమర్పించారు. దీంతో అనుమానించిన పోలీసులు కోవిడ్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆస్పత్రికి వెళ్లి విచారించారు. పోలీసుల అనుమానమే నిజమైంది. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
నకిలీ కోవిడ్ సర్టిఫికెట్లు సమర్పించిన అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిలపై బోయన్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అలాగే నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.