మంచి దొంగ: ఇళ్లంతా దోచేసి సారీ చెప్పాడు

దొంగల్లో కూడా మంచి దొంగలుంటారు. అలాంటి ఓ మంచి దొంగ ఘటనే ఇది. ఖాళీగా ఉన్న ఇల్లు దోచుకున్న ఓ దొంగ క్షమించమంటూ ఇంట్లో ఉత్తరం పెట్టి మరీ వెళ్లాడు. హైలెట్ ఏంటంటే.. ఆ…

దొంగల్లో కూడా మంచి దొంగలుంటారు. అలాంటి ఓ మంచి దొంగ ఘటనే ఇది. ఖాళీగా ఉన్న ఇల్లు దోచుకున్న ఓ దొంగ క్షమించమంటూ ఇంట్లో ఉత్తరం పెట్టి మరీ వెళ్లాడు. హైలెట్ ఏంటంటే.. ఆ మంచి దొంగ అలా కొల్లగొట్టింది పోలీసాఫీసర్ ఇంటిని. మధ్యప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన.

మధ్యప్రదేశ్ లోని భింద్ నగరంలో పనిచేస్తున్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ కమలేష్. ఓ పనిమీద కమలేష్ తో పాటు కుటుంబసభ్యులంతా బంధువుల ఇంటికెళ్లారు. సరిగ్గా అదను చూసిన ఓ దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. నగలు, డబ్బుతో పాటు ఖరీదైన వస్తువులన్నీ దోచుకున్నాడు.

వెళ్తూ ఇంట్లో మంచంపై ఓ ఉత్తరం కూడా పెట్టాడు. పరిస్థితుల ప్రభావం వల్ల దొంగతనం చేయాల్సి వస్తోందని, ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకుమించి తనకు మార్గం కనిపించలేదని, క్షమించాలంటూ ఉత్తరం పెట్టి వెళ్లాడు. భవిష్యత్తులో బాగా సంపాదించి, దోచుకున్నది తిరిగి ఇచ్చేస్తానని కూడా లెటర్ లో రాసుకొచ్చాడు. 

ఇంటికొచ్చిన తర్వాత దొంగతనం జరిగిందని గుర్తించాడు కమలేష్. మంచంపై పెట్టిన ఉత్తరం ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. పక్కా ప్లానింగ్ తోనే ఇంట్లో దొంగతనం చేసినట్టు గుర్తించారు పోలీసులు. 

మరీ ముఖ్యంగా కమలేష్ ఇంట్లో లేడని నిర్థారించుకున్న తర్వాతే చోరీకి పాల్పడ్డాడు. కమలేష్ దగ్గర బంధువులే ఎవరో కావాలని ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.