అనగనగా ఓ చీమ తన పని తాను బాగా చేస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత చీమ పనితీరు ఎలా ఉందో చూడాలని అనిపిస్తుంది యజమానికి. దానికి ఓ బాస్ ని నియమిస్తాడు. ఆపై మరో బాస్ వస్తాడు, ఇంకో బాస్ కూడా చీమ గురించి ఎంక్వయిరీ మొదలు పెడతాడు. అప్పుడు చీమ అసలు పని ఆపేసి, బాస్ లందరికీ నివేదికలు ఇవ్వడం మొదలు పెడుతుంది. వ్యవహారం చెడిపోతుంది. సచివాలయాల విషయంలో ఇలాంటి పరిస్థితే వస్తుందేమో అనిపిస్తోంది. సచివాలయాల సందర్శన పేరుతో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇలాంటి కథనే తలపిస్తోంది.
ఇక నుంచి ప్రతి వారం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటినీ కలెక్టర్లు పర్యవేక్షించాలి. వారానికి 4 సచివాలయాలను జాయింట్ కలెక్టర్లు సందర్శించాలి. మున్సిపల్ కమిషనర్ లు, ఐటీడీఏ పీవోలు కూడా వారానికి 4 సచివాలయాలు సందర్శించే కార్యక్రమాలు పెట్టుకోవాలి. అధికారులతో కలసి ఎమ్మెల్యేలకు కూడా ఈ పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్పారు. వీటన్నిటినీ సీఎంఓ కార్యాలయం మానిటర్ చేస్తుంది. ఇందుకోసం నలుగురు ప్రత్యేక అధికారులుంటారు. ఈ పర్యవేక్షణ ఆధారంగానే, జేసీలు, కలెక్టర్ల పనితీరు మదింపు చేస్తామని కూడా చెప్పారు సీఎం జగన్.
ప్రస్తుతానికి ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు బాగానే పనిచేస్తున్నాయి. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా సమస్యలు వస్తే.. నేరుగా గ్రామస్తులే ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ దశలో వీటిపై మళ్లీ మానిటరింగ్ కమిటీలు అవసరమా..? పోనీ అవసరమే అనుకుంటే.. ఇంతమంది ఇన్నిసార్లు సచివాలయాలు సందర్శిస్తే, ఇక అక్కడ పనులేం జరుగుతాయి. పర్యవేక్షణలకే సమయం సరిపోతే.. ప్రజల సమస్యలు తీరేదెప్పుడు.
గతంలో స్పందన పేరుతో కలెక్టరేట్లలో కార్యక్రమాలు జరిగేవి. ప్రతి సోమవారం కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీస్ లు కిటకిటలాడేవి. కరోనా కష్టకాలం తర్వాత ఆ కార్యక్రమం పూర్తిగా మరుగునపడిపోయింది. అంటే ప్రజల సమస్యలు అటకెక్కినట్టు కాదు. స్పందన కార్యక్రమం ఉందీ అని ప్రకటిస్తే అందరూ అర్జీలు పట్టుకుని వచ్చేస్తారు. అసలు బాధితుడెవరో, వారిని వెంటబెట్టుకుని కలెక్టరేట్ల వద్ద దర్పం ప్రదర్శించే చోటా మోటా నాయకులెవరో తెలియని పరిస్థితి. కార్యక్రమం పేరుతో అసలు సమస్యలు పక్కదోవ పట్టకుండా ఉంటే అదే మంచిది.
మండల స్థాయి అధికారులు సచివాలయాల బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సమస్యలన్నీ సచివాలయ పరిధిలోనే పరిష్కారం అవుతున్నాయి. వ్యవస్థ సజావుగా సాగుతోంది కాబట్టే.. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపై అధ్యయనం చేయాలని తమ అధికారుల్ని పురమాయిస్తున్నాయి. ఈ దశలో సచివాలయాల పనితీరు మెరుగుపరిచేందుకంటూ ప్రవేశ పెట్టిన సందర్శన కార్యక్రమాలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయి. సచివాలయ ఉద్యోగల పనితీరుపై ఇవి ప్రభావం చూపించడం ఖాయం.