సముద్రం అడుగున ‘ఐ లవ్ యు’ చెప్పాడు

మెహ్రీన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా భవ్య బిష్ణోయ్ తో ఆమెకు ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే ఆమెది ప్రేమ వివాహమా.. లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే అనుమానం…

మెహ్రీన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా భవ్య బిష్ణోయ్ తో ఆమెకు ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే ఆమెది ప్రేమ వివాహమా.. లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే అనుమానం చాలామందిలో ఉంది. ఎట్టకేలకు ఈ డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది మెహ్రీన్. పెద్దల అంగీకారంతో తాము ప్రేమించుకున్నామని వెల్లడించింది.

“నా తల్లిదండ్రులు, భవ్య పేరెంట్స్ ముందుగా కలుసుకున్నారు. కుటుంబాలు బాగా కలిశాయి. ఆ తర్వాత మేం కలిశాం. తల్లిదండ్రుల అనుమతితో ఓ వ్యక్తిని ప్రేమిస్తే ఆ మజానే వేరు. మేం వెంటనే కలిసిపోయాం. మాది 10 నెలల జర్నీ అయినప్పటికీ, చిన్నప్పట్నుంచి భవ్య నాకు తెలుసు అనిపించేలా కలిసిపోయాం.”

కలిసి మాట్లాడ్డం ప్రారంభించిన 6 రోజులకే మెహ్రీన్ కు, భవ్య ప్రపోజ్ చేశాడట. పెళ్లి చేసుకోవాలని కోరాడట. అండమాన్ లో తనకు ఐ లవ్ యు చెప్పాడని, అది కూడా సముద్రం అడుగున ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది.

“భవ్య పుట్టినరోజు కోసం అండమాన్ వెళ్లాం. అప్పుడు నేను అండమాన్ లో స్కూబా డైవింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. అదే టైమ్ లో భవ్య నన్ను సముద్రం నీటిలోకి తీసుకెళ్లాడు. అండర్ వాటర్ లో ఒక మోకాలిపై నిల్చొని నాకు ప్రపోజ్ చేశాడు. అదంతా ఓ మేజిక్ లా జరిగిపోయింది.”

మెహ్రీన్-భవ్య పెళ్లికి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకున్నారు. చాలామంది సెలబ్రిటీల్లా ఈ జంట కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తోంది.