దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కేసుల సంఖ్య తగ్గుముఖంలో కొనసాగుతూ ఉంది. కేసుల సంఖ్య తగ్గినా గత కొన్నాళ్లుగా నంబర్ మాత్రం స్థిరంగా సాగుతూ ఉంది. జూన్ నెలాఖరుకే కరోనా సెకెండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని చాలా మంది పరిశోధకులు అంచనా వేశారు. అయితే జూలై రెండో వారం వచ్చినా రోజువారీ కేసులు 40 వేల స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి.
నలభై వేల స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో రెండో వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టినట్టు కాదని స్పష్టం అవుతోంది. సెకెండ్ వేవ్ లో కరోనా కేసులు రోజువారీగా నాలుగు లక్షల పై స్థాయిలో నమోదయ్యాయి ఒక దశలో. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం పది శాతం కేసులు కొనసాగుతూ ఉన్నాయి.
ఒకవైపు ఆగస్టు రెండో వారం నుంచినే థర్డ్ వేవ్ ప్రారంభం కావొచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జూలై రెండో వారంలో కూడా నలభై వేల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయంటే.. పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నట్టా? లేనట్టా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక ఇంకోవైపు వ్యాక్సినేషన్ మందకొడి వేగంతో కొనసాగుతూ ఉంది. ఒక్కో రోజు ఫర్వాలేదనిపించే స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగితే, మరుసటి రోజే మరింత తక్కువ నంబర్లు నమోదవుతున్నాయి. ఈ వారంలో పరిస్థితిని గమనిస్తే.. సోమవారం రోజున సుమారు 46 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగిందట. అదే మంగళవారం విషయానికి వస్తే.. 36 లక్షల డోసులు వ్యాక్సినేషన్ మాత్రమే జరిగిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఏకంగా పది లక్షల వ్యాక్సినేషన్ డోసుల తేడా!
ఒక్కో రోజేమో మెరుగైన స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం, ఆ మరుసటి రోజునే అందులో సగం స్థాయి పడిపోవడం పరిపాటిగా మారింది. రోజు రోజుకూ వ్యాక్సినేషన్ స్థాయి కూడా పెరగాల్సిన పరిస్థితుల్లో.. తగ్గుదల నమోదవుతూ ఉండటం గమనార్హం. ఆగస్టు ఒకటి నాటికి రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమంటూ ప్రభుత్వం రెండు నెలల కిందటే ప్రకటించింది. అయితే ఇప్పటికీ ఇంకా ముప్పై, నలభై లక్షల డోసులే ఎక్కువ అన్నట్టుగా మారింది ప్రతి రోజుకూ.
మరో మూడు వారాల్లో రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ అందించేంత సీన్ ఉంటుందా? అనేది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇక ఇప్పటి వరకూ ఇండియాలో మొత్తం 36 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగిందట. వీటిలో రెండు డోసుల వారి సంఖ్య ఐదారు కోట్ల స్థాయిలోనే కొనసాగుతూ ఉంది. కనీసం 190 కోట్ల డోసుల పరిమాణంలో వ్యాక్సినేషన్ జరగాలి. నెలలు గడిచిపోతున్నాయి కానీ, కనీసం నాలుగో వంతు పరిమాణాన్ని కూడా ఇంకా అందుకోలేదు.