తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని నియమించి ఉన్నా.. వారిపై పార్టీలోనే కొందరు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. ఇది నిత్య సత్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అది తప్పడం లేదు. ప్రధానంగా రేవంత్ రెడ్డిపై ఇప్పటి వరకూ ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకతతో ఉన్నారు. ఆయన ఆ స్థానానికి అర్హుడు కాదు అని, ఆ స్థానంలో తమను అధిష్టానం నియమించాల్సిందనేది వారి అభిప్రాయం. ఆ మేరకు పీసీసీ పీఠానికి వారు పోటీ పడ్డారు. అయితే లక్ రేవంత్ ను వరించింది.
ఈ క్రమంలో బాహాటంగానే అసహనాన్ని చాటుతున్న నేతలిద్దరున్నారు. వారే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి. టీపీసీసీ పీఠాన్ని ఆశించిన నేతలే వీరిద్దరూ. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాన్నాళ్లుగా ఈ ప్రయత్నంలో ఉన్నారు. అధిష్టానానికి తన విన్నపాన్ని తెలియజేసుకున్నారు.
గతంలో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా కోమటిరెడ్డి సోదరులు వ్యతిరేక భావనతోనే పని చేశారు. అప్పుడే తమకు పీసీసీ పీఠం కావాలని వారు ఆశించారు. అది ఇప్పుడు రేవంత్ కు దక్కే సరికి వారు అసహనంతో ఉన్నారు. మొదటి రోజే వెంకటరెడ్డి తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఇక రేవంత్ తన ప్రమాణ స్వీకారకార్యక్రమానికి ముఖ్య నేతలను ఆహ్వానించే ప్రక్రియలో భాగంగా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఇటు జీవన్ రెడ్డిని కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలను ఆహ్వానించేందకు వెళ్లి కూడా.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లలేదట రేవంత్. పీసీసీ పీఠం విషయంలో తనకు పోటీ వచ్చాడనుకున్నాడో ఏమో కానీ.. ఆ సీనియర్ నేతను రేవంత్ రెడ్డి పిలవలేదట.
శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లను కలిసి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డిని మాత్రం ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించకపోవడం చర్చకు దారి తీస్తోంది. రేవంత్ పై జీవన్ రెడ్డి కి అసహనమే కాదు, జీవన్ రెడ్డిపై కూడా రేవంత్ లో లెక్కలేని తనం ఉందని ఇలా స్పష్టం అవుతోంది. పీసీసీ పీఠంపై ఎవరున్నా కాంగ్రెస్ లో అసమ్మతి వర్గాలు కామన్. ఈ వేడికి రేవంత్ రెడ్డి ఏ మాత్రం మినహాయింపు కాదని ఆదిలోనే స్పష్టత వస్తోంది.