కాసేపట్లో వధువు మెడలో మూడు ముళ్లు పడాల్సిన సమయం. సరిగ్గా ముహూర్తానికి సమయం ఆసన్నమవుతున్న వేళలో కళ్యాణమండపంలోకి పోలీసులు ప్రవేశించారు. ఆ తర్వాత ఏమైందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.
అనంతపురం జిల్లా గుత్తి మండలం ఆసురాళ్లపల్లికి చెందిన రమేష్ అనే యువకుడికి పెద్దవడుగూరు మండలానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి పత్రికలు కొట్టించి, బంధుమిత్రాదులను ఇరువైపు కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. శుభముహూర్త సమయానికి అందరూ హాజరయ్యారు. పెళ్లి మండపం సందడిగా ఉంది. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సి వుంది.
సరిగ్గా ఇదే సమయంలో పోలీసులు అక్కడికి ప్రవేశించారు. ఒక్కసారిగా కళ్యాణ మండపంలో కలకలం. ఏమైందంటూ అందరూ ఆరా. వరుడు రమేస్‌ను గుత్తి పోలీస్‌స్టేసన్‌కు తరలించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువతిని వరుడు రమేష్ ప్రేమించిన సంగతి బయటపడింది. తనతో ప్రేమ కార్యకలాపాలు సాగించి, మరో యువతిని పెళ్లాడబోతున్న విషయం తెలిసి… సదరు ప్రేయసి గుత్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తమ ప్రేమకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది.
దీంతో పోలీసులు వరుడి స్వగ్రామంలో జరుగుతున్న పెళ్లిని నిలిపి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, ప్రేయసిని వివాహమాడుతానని పోలీసులతో రమేష్ చెప్పాడు. దీంతో వధువు తరపు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రేయసిని కాకుండా తమ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకుని మోసం చేశాడని వధువు తరపు వారు మండిపడ్డారు. తాము తలెత్తుకుని తిరగలేమని, అవమానించారని, న్యాయం చేయాలని వధువు తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్చకు తెరలేచింది. పెళ్లి పీటలపై పెళ్లి ఆగిపోవడం, ప్రియురాలితో ఏడడుగులు నడిచేందుకు వరుడు అంగీకరించిన విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.