టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌పై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచ్ డైలాగ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో గుడివాడ రోజురోజుకూ ఆరితేరిపోతు న్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడా అసభ్యతకు చోటు లేకుండా రాజకీయ విమర్శలు చేయడం గుడివాడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గుడివాడ ప్రెస్‌మీట్ పెట్టారంటే ప్రత్యర్థులకు వీపు విమానం మోతే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గుడివాడ అమర్నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తండ్రీతనయులపై చెలరేగిపోయారు. ఎవరెవరికో సూటు-బూటు వేసి ఎంవోయులు కుదుర్చుకున్న ఘనత చంద్రబాబుదే అని వ్యంగ్యంగా అన్నారు. టీడీపీ హయాంలో పెట్టుబడులన్నీ కేవలం నోటి మాటలే అని ఎద్దేవా చేశారు.
విదేశాల్లో చదివిన లోకేశ్ బుర్రకు జపాన్ ప్రతినిధులు చెప్పిన విషయాలు అర్థం కాలేదా? అని మంత్రి నిలదీశారు. ఐటీశాఖ మంత్రిగా పనిచేసిన లోకేశ్ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారు? అలాగే లోకేశ్ వారంలో జగన్ ప్రభుత్వ కుంభకోణాన్ని బయటపెడతానని ప్రకటించడం… మంగళవారం సామెతలా ఉందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి కోరితే, చంద్రబాబు మాత్రం చావు కోరే రకమని మండిపడ్డారు. బ్రాహ్మణితో తగువులు వుంటే ఇంట్లో పరిష్కరించుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు. జగన్ సతీమణి వైఎస్ భారతమ్మను రాజకీయాల్లోకి లాగి, బ్రాహ్మణిని తిట్టించాలన్నదే లోకేశ్ ఉద్దేశమా? అని మంత్రి నిలదీశారు.
మంగళగిరిలో మరోసారి లోకేశ్‌కు సర్వమంగళమే అని హెచ్చరించారు. “మనం” సినిమాలో మాదిరిగా చంద్రబాబు, లోకేశ్ జూబ్లీ ప్యాలెస్‌లో శేష జీవితం గడపాలని మంత్రి గుడివాడ సలహా ఇచ్చారు.