ఆ రాష్ట్రంలోనూ మండ‌లి రాజ‌కీయం.. కేంద్రం చేతుల్లోకి!

ప‌శ్చిమ బెంగాల్ లో శాస‌న‌మండ‌లిని పున‌రుద్ధ‌రిస్తూ  ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టి ఆమోదం తెలిపింది. ప్ర‌తిప‌క్ష బీజేపీ ఈ నిర్ణ‌యాన్ని…

ప‌శ్చిమ బెంగాల్ లో శాస‌న‌మండ‌లిని పున‌రుద్ధ‌రిస్తూ  ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టి ఆమోదం తెలిపింది. ప్ర‌తిప‌క్ష బీజేపీ ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించ‌గా, మెరుగైన మెజారిటీతో మండ‌లి ఏర్పాటుకు ప్ర‌భుత్వం తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు పంపించారు. ఆయ‌న ఆమోదం అనంత‌రం పార్ల‌మెంట్ లో మండ‌లి ఏర్పాటుకు అనుగుణంగా నిర్ణ‌యం జ‌ర‌గాల్సి ఉంది. ఆ త‌ర్వాతే బెంగాల్ లో మండ‌లి ఏర్పాటుకు అవ‌కాశం వ‌స్తుంది. అయితే మండ‌లి ఏర్పాటును అక్క‌డ బీజేపీ వ్య‌తిరేకిస్తూ ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ తీర్మానానికి లోక్ స‌భ‌లో ఆమోదం ల‌భిస్తుందా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

పార్ల‌మెంట్ లో ఈ తీర్మానాన్ని అడ్డుకుంటామంటూ సువేందు అధికారి ప్ర‌క‌టించేశారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఈ అంశం ప‌ట్ల సానుకూలంగా స్పందిస్తుందా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అందులోనూ మ‌మ‌త ప‌ట్ల రాజ‌కీయ వ్య‌తిరేక‌త ఢిల్లీ బీజేపీ నేత‌ల్లోనూ గ‌ట్టిగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆమె కోరిక ప‌ట్ల కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా అనేది అనుమాన‌మే.

మ‌మ‌త ఇటీవ‌లి బెంగాల్ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఎమ్మెల్సీగా నామినేట్ కావ‌డానికి ఏమీ ఈ మండలి ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోలేదు. త‌మ ఎన్నిక‌ల హామీలోనే ఈ నిర్ణ‌యం ఉన్న‌ట్టుగా టీఎంసీ చెబుతోంది. ఈ ఏడాది నవంబ‌ర్ కు మ‌మ‌త ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ హోదాను సంపాదించుకోవాల్సి ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మండ‌లి ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆ లోపు గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోవ‌చ్చు. 

మండ‌లి క‌న్నా ఉప ఎన్నిక‌నే మ‌మ‌త న‌మ్ముకునే అవ‌కాశం ఉంది. క‌రోనా కేసుల తీవ్ర‌త త‌గ్గితే సీఈసీ పెండింగ్ లో ఉన్న ఉప ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రెడీ అయ్యే అవ‌కాశాలున్నాయి. వ‌చ్చే ఏడాది య‌థారీతిన యూఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయంటూ సీఈసీ ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అలాంటిది కొన్ని అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నిక‌ల‌ను మాత్రం వాయిదా వేయ‌క‌పోవ‌చ్చు!