ఆ మధ్య హైదరాబాద్ లో కిడ్నాప్ ఉదంతంతో భూమా ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. ఒక భూవివాదానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను వీరు కిడ్నాప్ చేయించినట్టుగా కేసులు నమోదయ్యాయి. ఆ వ్యవహారంలో భూమా అఖిలప్రియ అరెస్టు అయ్యారు.
ఆమె భర్త పరార్ అయ్యాడు. ఆ తర్వాత ఆమె తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ కూడా పరారీ అయ్యాడు. అఖిలప్రియ కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చింది. ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉంటూనే బెయిల్ తెచ్చుకున్నాడు. జగత్ విఖ్యాత్ కు కూడా పరారీలో ఉండగానే బెయిల్ లభించింది.
ఇక తాజాగా వీరిపై మరో అభియోగం నమోదైనట్టుగా తెలుస్తోంది. కోర్టు విచారణ నుంచి తప్పించుకునేందుకు వీరు తమకు కరోనా సోకినట్టుగా తప్పుడు నిర్ధారణ పత్రాలను సమర్పించారట! ఈ నెల మూడో తేదీన వీరు విచారణకు కోర్టుకు హాజరు కావాల్సిందట. అయితే తాము హాజరు కాలేమని, కరోనాను సాకుగా చూపించారట జగత్ విఖ్యాత్, భార్గవ్ రామ్.
అందుకు రుజువులుగా వీరు సమర్పించిన కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్లు నకిలీవి అని తేలిందట. వీరు ఎక్కడ కోవిడ్ టెస్టులు చేయించుకున్నారనే అంశంపై దృష్టి పెట్టిన పోలీసులు.. ఆ సెంటర్ కు వెళ్లి విచారించగా, అవి నకిలీ సర్టిఫికెట్లు అని తేలిందని తెలుస్తోంది. దీంతో సదరు సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం.
మరి తప్పుడు కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ ఇచ్చిన సెంటర్ పై పోలీసులు కేసులు పెట్టడంతో, కోర్టుకు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన భూమా ఫ్యామిలీ మెంబర్స్ పై ఎలాంటి చర్యలుంటాయనేది ఆసక్తిదాయకంగా మారింది.
విచారణకు సహకరించాల్సింది పోయి, ఇలా కోవిడ్ ను కూడా సాకుగా చూపి కోర్టుకు హాజరు కావడానికి తప్పించుకునే ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలోనూ భంగపడ్డారంటే.. భూమా యంగ్ జనరేషన్ పూర్తిగా రాంగ్ గైడెన్స్ లో ముందుకు సాగుతున్నట్టుగా అంతా అనుకునే అవకాశం ఉంది.