బాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ కన్నుమూత

బాలీవుడ్ దిగ్గజం, హిందీ సినిమాను మలుపుతిప్పిన ట్రెండ్ సెట్టర్ దిలీప్ కుమార్ కన్నుమూశారు. కొన్నేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఈ దిగ్గజ నటుడు ఈరోజు ఉదయం ముంబయిలోని హిందుజా హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.…

బాలీవుడ్ దిగ్గజం, హిందీ సినిమాను మలుపుతిప్పిన ట్రెండ్ సెట్టర్ దిలీప్ కుమార్ కన్నుమూశారు. కొన్నేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఈ దిగ్గజ నటుడు ఈరోజు ఉదయం ముంబయిలోని హిందుజా హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.

దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసఫ్ ఖాన్. బాలీవుడ్ సినిమాను మలుపుతిప్పిన దిగ్గజ నటుడీయన. ఇంకా చెప్పాలంటే భారతీయ చలనచిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్ గా చెప్పుకునే తరానికి ఈయన ప్రతినిథి. దేవదాస్, మొఘల్-ఎ-ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి వంటి క్లాసిక్ సినిమాలు ఈయనవే.

మ్యూజికల్ హిట్స్ కు కేరాఫ్ అడ్రస్ దిలీప్ కుమార్. ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో పాటలన్నీ  హిట్టయ్యేవి. ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ బాలీవుడ్ ఆల్ టైమ్-50 క్లాసిక్ సాంగ్స్ లో దిలీప్ కుమార్ పాటలే ఎక్కువే. అదీ ఆయన స్టామినా.

1944లో విడుదలైన జ్వర్ భాతా అనే సినిమాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు దిలీప్ కుమార్. అప్పట్నుంచి 1998 వరకు దశాబ్దాల పాటు నటిస్తూనే ఉన్నారు. 98లో వచ్చిన ఖిల్లా సినిమా ఆయన చివరి చిత్రం. తనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సైరా బానును దిలీప్ పెళ్లాడారు.

హిందీ చిత్రసీమకు దిలీప్ కుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు దాదాసాహెబ్ పాల్కే పురస్కారం లభించింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఇవి కాకుండా తన కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు దిలీప్ కుమార్.