కృష్ణా జలాల వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నోరు మెదపకపోవడం చూసి రాయలసీమ సమాజం ఆశ్చర్యపోతోంది. ఇదే అన్యాయం తన భార్య నారా భువనేశ్వరి పుట్టింటోళ్లకు జరిగి ఉంటే చంద్రబాబు ఇలాగే మౌనాన్ని ఆశ్రయించేవారా? అనే ప్రశ్నలు రాయలసీమ సమాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి.
రాయలసీమ అంటే మొదటి నుంచి చిన్న చూపు ఉండడం వల్లే చంద్రబాబు, ఇప్పుడు కూడా తనకేం సంబంధం లేని వ్యవహారంగా తెలంగాణ ప్రభుత్వ దౌర్యన్యాన్ని చూస్తూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని సీమ పౌర సమాజం మండిపడుతోంది.
భార్య వచ్చాక… తల్లి అల్లం, పెళ్లాం బెల్లం అవుతుందనే సామెత చంద్రబాబు విషయంలో నిజమవుతోందని నెటిజన్లు వ్యంగ్యంగా అంటున్నారు. శ్రీశైలంలో నీటి హక్కుల్ని కాపాడలేక చేతులెత్తేసిన జగన్రెడ్డి పుట్టిన గడ్డకే ద్రోహం చేస్తున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలకు, తమ పార్టీ అధినేత కూడా అదే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారనే విషయాన్ని మరిచిపోయినట్టున్నారని సీమ ఉద్యమకారులు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలిస్తామంటే చంద్రబాబు పోరాటానికి దిగారనే విషయాన్ని రాయలసీమ సమాజం గుర్తు చేస్తోంది. కేవలం తనకు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు మౌనంతో తెలంగాణకు మద్దతుగా నిలుస్తున్నారనే అనుమానాలు కూడా లేకపోలేదు. తనకు అన్ని రకాలుగా జన్మనిచ్చిన రాయలసీమ కంటే, పిల్లనిచ్చిన కృష్ణా జిల్లా ప్రయోజనాలే బాబుకు ఎక్కువయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
ఎప్పుడూ గడప దాటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని నారా భువనేశ్వరి …రాజధాని రైతుల పోరాటానికి సంఘీభావంతో పాటు తన బంగారు గాజులను ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సీమ మేధావులు ప్రస్తావిస్తున్నారు. ఆ స్థాయిలో సీమ కోసం త్యాగం చేయకపోయినా, కనీసం అన్యాయం చేయకుంటే చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నీళ్ల విషయంలో ఇదే అన్యాయం కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి జరిగి ఉంటే… చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా ఉండేవారు కాదని రాయలసీమ సమాజం భావిస్తోంది. ఇప్పటికైనా తనకు జన్మనిచ్చిన రాయలసీమ రుణం తీర్చుకునేందుకు కృష్ణా జలాల్లో ఏపీ హక్కుల్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని బాబుకు పలువురు హితవు చెబుతున్నారు.