దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా ఓ కేంద్ర మాజీ మంత్రి భార్యే హత్యకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పీఆర్ కుమారమంగళం భార్య కిట్టి కుమార మంగళం (67) గత రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు.
దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో ఉంటున్న ఇంట్లో విగత జీవిగా బుధవారం కనిపించారు. కిట్టి కుమారమంగళం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆమెను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదిలా ఉండగా ఈ హత్య కేసులో నిందితుడు ఒకరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
కిట్టీ కుమారమంగళం భర్త పీ రంగరాజన్ కుమారమంగళం 1984 లో మొట్టమొదట లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1991-92 మధ్య పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 1998లో ఆయన విద్యుత్‌శాఖ మంత్రిగా పని చేశారు. ఆమె కుమారుడు రంగరాజన్ మోహన్ కుమారమంగళం కాంగ్రెస్ నేత. బెంగళూరులో నివాసం ఉంటున్నారు. తల్లి హత్య వార్త తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి బయల్దేరారు.