ఉద్యోగస్తుల్లో పెరుగుతున్న అసంతృప్తి

నిజం నిష్టూరంగా వుంటుంది. నివురు కమ్మినంత మాత్రాన నిప్పు లేదని అనుకోవడానికి లేదు. ఉద్యోగస్తులు ఉద్యమించడం లేదు. ఉద్యోగ సంఘాలు విమర్శించడం లేదు. అంత మాత్రం చేసి ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఫుల్…

నిజం నిష్టూరంగా వుంటుంది. నివురు కమ్మినంత మాత్రాన నిప్పు లేదని అనుకోవడానికి లేదు. ఉద్యోగస్తులు ఉద్యమించడం లేదు. ఉద్యోగ సంఘాలు విమర్శించడం లేదు. అంత మాత్రం చేసి ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఫుల్ హ్యాపీగా వున్నారని అనుకోవడానికి లేదు. ఈ సంగతి ప్రభుత్వం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచింది.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ప్రభావితం చేస్తారు అన్నది వాస్తవం. చిరకాలంగా రాజకీయాల్లో ఇది క్లారిటీగా కనిపిస్తూ వస్తొంది. 2014లో ఉద్యోగులు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి అండగా వున్నారో, అదే ఉద్యోగులు అదే విధంగా 2019లో వైకాపా వైపు వచ్చారు. 

ఉద్యోగులు ఎటు వుంటే అటు విజయం అన్నది సులువు అవుతుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లతో పాటు , వారు తాము పని చేసే చోట వుండే ఓట్లను కూడా ప్రభావితం చేయగలుగుతారు.

అలాంటి ఉద్యోగులు ఇప్పుడు ఆంధ్రలో కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని నిలదీయలేక, అలా అని తమకు రావాల్సినవి రాక దిక్కులు చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం కేవలం తమ దృష్టి అంతా జనాలకు డబ్బులు పంచే పని మీదే పెట్టింది. ఈ రంథిలో పడి ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు గమనించడం లేదు. సమయానికి వారికి ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు.

చంద్రబాబు హయాంలో బాకీ పడినవి అయితేనేం, జగన్ వచ్చాక బాకీ పడుతున్నవి అయితేనేం దాదాపు అరడజనుకు పైగా డిఎ లు ఉద్యోగులకు బకాయి పడి వున్నాయి. దారుణం ఏమిటంటే ఈ డిఎలు రాకుండానే, ఆ డబ్బులు అనుభవించకుండానే చాలా మంది పెన్షనర్లు చనిపోతున్నారు. వారు బతికి వుండగా డిఎలు వస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడేవి. 

ఇక చాలా చోట్ల పింఛన్లు సకాలంలో పడడం లేదు. కొన్ని జిల్లాల్లో ఒకటవ తేదీన రావాల్సిన పింఛన్లు 15కు వస్తున్నాయి.  పేదలకు ఇవ్వాల్సిన పింఛన్లు ఫస్ట్ తేదీన పట్టుకెళ్లి ఇళ్లదగ్గర అందిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పింఛను దారులను మాత్రం పట్టించుకోవడం లేదు. 

ఇక వేతన సవరణ అన్నది ఏకంగా మరిచేపోయారు. వేతన సవరణ సంఘం వేయడం, ఇంటీరియమ్ రిలీఫ్ అనౌన్స్ చేయడం వంటి వ్యవహారాలు అలా పెండింగ్ లో పడిపోయాయి. ఇంటీరియమ్ రిలీప్ ఇస్తే పింఛను దారులకు కూడా ఊరట కలుగుతుంది. ఇవన్నీ అస్సలు ఎవ్వరికీ పట్టడం లేదు.

ఎన్నికలకు దగ్గర చేసి డిఎలు ఇచ్చి, ఇంటీరియమ్ రిలీఫ్ ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నట్లు వుంది ప్రభుత్వం. కానీ ఇలా చేయడం వల్ల ఎంతో మంది పింఛనర్లు నష్టపోతారు అన్న సంగతి విస్మరిస్తోంది. ఇప్పుడు ఉద్యోగస్తులంతా జగన్ ప్రభుత్వం చేస్తున్న పందేరాలు చూసి నిట్టూరుస్తున్నారు. వారిలో వారు నిరసన వ్యక్తం చేసుకుంటున్నారు. 

మొత్తం మీద చూస్తుంటే ఉద్యోగస్తులు మరోసారి ఎన్నికలను ప్రభావితం చేసేలా కనిపిస్తోంది వ్యవహారం.