గోల్డ్ స్మగ్లింగ్.. తగ్గేదేలే అంటున్న స్మగ్లర్లు

బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారింది. ఎన్ని సార్లు పట్టుబడినా, స్మగ్లర్లు తగ్గేదేలే అంటున్నారు. వివిధ రూపాల్లో, రకరకాల ఎత్తుగడలతో బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు, కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. Advertisement…

బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారింది. ఎన్ని సార్లు పట్టుబడినా, స్మగ్లర్లు తగ్గేదేలే అంటున్నారు. వివిధ రూపాల్లో, రకరకాల ఎత్తుగడలతో బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు, కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు.

మొన్నటికిమొన్న బంగారాన్ని లిక్విడ్ గా మార్చి, చీరపై స్ప్రే చేసి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోయాడు ఓ క్రియేటివ్ స్మగ్లర్. అయితే ఇవన్నీ ఒకెత్తు, ఈరోజు జరిగిన స్మగ్లింగ్ మరో ఎత్తు. ఒకేసారి 8 కిలోల బంగారం పట్టుబడింది. సింగిల్ డేలో ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. దీని విలువ 4 కోట్ల 86 లక్షల రూపాయలుగా లెక్కగట్టారు.

ఒకే మొత్తంలో బంగారాన్ని తరలిస్తే దొరికిపోతున్నామని భావించిన స్మగ్లర్లు, ఈసారి వివిధ వ్యక్తుల ద్వారా, వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని తరలించాలని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ అంతా కలిసి ఒకే చోట దొరికిపోయారు.

ప్లాన్ ప్రకారం, బ్యాంకాంక్ నుంచి ఇద్దరు దిగారు. తమ ప్యాంటుల్లో 2 కిలోల బంగారాన్ని దాచుకున్నారు. ఇద్దరూ దొరికిపోయారు. వాళ్ల ముసుగులో మరో వ్యక్తి అదే ఫ్లయిట్ నుంచి దిగి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతడు కూడా 2 కిలోల బంగారంతో దొరికిపోయాడు.

ఇక మూడో కేసులో షార్జా నుంచి మరో వ్యక్తి దిగాడు. 2 కేజీల 170 గ్రాముల బంగారాన్ని పేస్టులా మార్చి తరలించే ప్రయత్నం చేశాడు. ఇక నాలుగో కేసులో దుబాయ్ నుంచి మరో వ్యక్తి 2 కిలోల బంగారంతో దొరికిపోయాడు. అతడు కూడా బంగారాన్ని పేస్టులా మార్చి, తన ప్యాంటులో సర్దుకొని వచ్చాడు.

ఇలా ఒకే రోజు, నలుగురు వ్యక్తులు, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చి 8 కిలోల బంగారంతో పట్టుబడ్డారు. దీని మొత్తం విలువను 4 కోట్ల 86 లక్షలుగా నిర్థారించారు అధికారులు. మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకొని, నలుగుర్ని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.