జ‌గ‌న్‌, బాబు…మ‌న ఖ‌ర్మ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌కీయాలే శాపంగా మారాయి. రాజ‌కీయాల్లో శ‌త్రువుల్లా మెలిగే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లుండ‌డం ఏపీ దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్లు మ‌న అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లుగా ఉండ‌డం మ‌న ఖ‌ర్మ అని స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంద‌ని…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌కీయాలే శాపంగా మారాయి. రాజ‌కీయాల్లో శ‌త్రువుల్లా మెలిగే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లుండ‌డం ఏపీ దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్లు మ‌న అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లుగా ఉండ‌డం మ‌న ఖ‌ర్మ అని స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంద‌ని జ‌నం అంటున్నారు. స‌మాజానికి ఆద‌ర్శంగా నిల‌వాల్సిన ఈ ఇద్ద‌రు నేత‌లు, ఎలా వుండ‌కూడ‌దో భావిత‌రాల‌కు త‌మ న‌డవ‌డిక‌తో ఓ సందేశాన్ని ఇస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి పాల‌క‌ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం చూడ‌లేదు. భ‌విష్య‌త్‌లో చూడాల‌ని కోరుకోవ‌డం లేదు.

క‌నీస మ‌ర్యాద‌కైనా పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ప‌ల‌క‌రించుకోక‌పోతే ఎలా? వీళ్ల‌ద్ద‌రూ రాజ‌కీయ పార్టీల‌కు, ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారా? లేక ఫ్యాక్ష‌న్ గ్రూపుల‌కా? ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ హ‌రిచంద‌న్ ఎట్‌ హోం కార్యక్రమం నిర్వ‌హించారు.  సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్ద‌రూ వెళ్లారు. కానీ వేర్వేరుగా ఆసీనులయ్యారు. క‌నీసం ఎదురెదురుగా చూసుకోడానికి ఇద్ద‌రు నాయ‌కులు మాన‌సికంగా సిద్ధంగా లేర‌ని అర్థ‌మ‌వుతోంది.

సీఎం దంప‌తులు, గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు, హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ త‌దిత‌ర ముఖ్య నాయ‌కులంతా ప్ర‌ధాన వేదిక వ‌ద్ద కూచున్నారు. చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు కొంచెం దూరంలో కూచున్నారు. గ‌తంలో ఇలా వుండేది కాదు. పాల‌క‌ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌ర‌స్ప‌రం ఆప్యాయంగా ప‌ల‌కిరించుకునే వారు. న‌వ్వుతూ క‌బుర్లు చెప్పుకునే వారు. మీడియాకు పండుగే. అదేంటో కానీ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య మాత్రం క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

గ‌తంలో చంద్ర‌బాబు త‌న‌ను అంట‌రానివాడిగా చూశారనే అక్క‌సు జ‌గ‌న్‌లో గూడు క‌ట్టుకుంది. దీంతో తాను కూడా అట్లే వ్య‌వ‌హ‌రించి క‌క్ష తీర్చుకోవాల‌నే మ‌న‌స్త‌త్వం జ‌గ‌న్‌లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. గ‌తంలో చంద్ర‌బాబు త‌న‌ను ఏ విధంగా చూసినా, ప్ర‌స్తుతం రాష్ట్ర పెద్ద‌గా జ‌గ‌న్ హూందాగా వ్య‌వ‌హ‌రిస్తే ఆయ‌న‌కే గౌర‌వం పెరిగేది. ఎట్ హోంలో చంద్ర‌బాబు వ‌ద్ద‌కు జ‌గ‌న్ వెళ్లి ప‌ల‌క‌రించి వుంటే బాగుండేది. తద్వారా జ‌గ‌న్ పెద్ద‌రికం నిలిచేది. లేదంటే జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు ప‌ల‌క‌రించినా బాగుండేది. ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం అంద‌రికీ కావాల్సింది.

దివంగ‌త వైఎస్సార్ రాజ‌కీయ స‌మ‌కాలికుడు చంద్ర‌బాబు. నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు. అలాగే పాల‌కుడిగా, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబుకు ఓ చ‌రిత్ర వుంది. ఆయ‌న్ను ప‌ల‌క‌రిస్తే జ‌గ‌న్‌కు న‌ష్ట‌మేమీ రాదు. ఇదే సంద‌ర్భంలో త‌న నేప‌థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు ఆప్యాయంగా ప‌ల‌క‌రించి వుంటే, సీఎం వ్య‌క్తిత్వం చిన్న‌బోయేది.

జ‌గ‌న్, చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఎందుక‌నో రాజ‌కీయాల్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకున్నారనే భావ‌న క‌లుగుతోంది. రాజ‌కీయంగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసుకున్నా, క‌నీసం ఇలాంటి సంద‌ర్భాల్లోనైనా పాల‌క‌ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌ర‌స్ప‌రం స్నేహంగా మెలిగితే బాగుండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.