వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదనేదిన సామెత. పవన్ కల్యాణ్ కు ఈ సామెత తెలిసే ఉంటుంది. కానీ, దాని అంతరార్థాన్ని మాత్రం ఆయన బోధపరచుకున్నట్టుగా లేదు. ఎందుకంటే.. అచ్చంగా జగన్ ను కాపీ కొడితే.. తాను కూడా ఈజీగా సీఎం అయిపోతానని పవన్ అనుకుంటున్నట్టుగా ఉంది. జగన్ సర్కారు పాలన మీద రెగ్యులర్ గా చేసే విమర్శలు మాత్రమే కాకుండా, ఇప్పుడు మరో పాట అందుకున్నారు. ‘‘ప్రభుత్వాన్ని నడపడానికి అర్హత వైకాపాకే ఉందా? మాకు లేదా? ఒక్కసారి జనసేనవైపు చూడండి’’ అని పవన్ కల్యాణ్ ప్రజల్ని బతిమాలుతున్నారు.
ఇదంతా ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అనే పదంతో తెలుగు ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఆకట్టుకున్నారని, ఆ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్లడం వల్ల ఆయనకు 2019లో అధికారం దక్కిందని అనుకోవడం వల్ల వచ్చిన అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర దూరంలో ఉండగా.. ఇప్పటినుంచి ‘‘ఒక్కసారి చూడండి’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళితే, ఆ రకంగా జగన్ మోహన్ రెడ్డి తీరును కాపీ కొడితే, తాను కూడా సీఎం అవుతానని పవన్ కల్యాణ్ తలపోస్తున్నట్టుగా ఉంది. కానీ అలా జరుగుతుందా?
‘‘ ఒక్క చాన్స్- అన్న పదానికి తెలుగు ప్రజలు పడిపోయారని, ఎవరొచ్చినా చేసేదేం లేదు కదా.. చాన్స్ ఇచ్చి చూద్దాం అని జగన్ కు ఓటేశారని’’ జరిగేదంతా ఒక కుట్రపూరిత ప్రచారం అని చెప్పాలి. తెలుగుదేశం వర్గాలు విస్తృతంగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లిన వ్యూహాత్మక ప్రచారం ఇది. ఎంతగా అంటే.. ఇదే ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు కూడా అమాయకంగా నమ్మారు.
ఒక్క చాన్స్ తమకు ప్రజలు ఇచ్చారని చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. ‘ఒక్క చాన్స్’ అని ఎవడు పడితే వాడు అడిగితే ఇచ్చేయడానికి తెలుగు ప్రజలు వెర్రివాళ్లు కాదు. అలా ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్న వాళ్లు కేవలం అతి కొద్ది శాతం మాత్రమే ఉంటారు. అలా ఒక్క చాన్స్ ఇవ్వడానికి కూడా.. ఇంకా అనేక కారణాలు వారిని ప్రేరేపించి ఉంటాయి. జగన్ రాజకీయంగా సమర్థంగా ఉండగలడా, పరిపాలన సాగించగలడా, చెప్పిన హామీలను నిలబెట్టుకోగలడా.. అతని గత చరిత్ర ఏమిటి.. గత పాలనానుభవాలు ఏమిటి? పార్టీ నిర్వహణలో చూపిస్తున్న కార్యకుశలత ఏమిటి అనే అనేక విషయాలను పరిశీలించి.. జనం ఓటు వేస్తారు.
ఆ ఫ్యాక్టర్స్ అన్నీ పట్టించుకోకుండా.. ‘ఒక్కసారి జనసేన వైపు చూడండి’ అని పవన్ కల్యాణ్ అడిగినంత మాత్రాన ఆయనకు ఓటు వేసేస్తారా? పార్టీని నడపడమే పవన్ కల్యాణ్ కు చేతకావడం లేదు. 2014 ఎన్నికలకు ముందు పుట్టిన ఆ పార్టీలో ఇప్పటిదాకా మూడో నాయకుడు లేడు. పవన్, నాదెండ్ల తప్ప.. జనసేన అంటూ జనమెరిగిన జనజీవితంలోని వ్యక్తి లేడు. పట్టుమని పదిమంది నాయకులను కూడా నమ్మించలేని పవన్ కల్యాణ్, ప్రజాజీవితంలో ఉన్నవారిని తన విధానాలతో ఆకట్టుకుని, తన పార్టీలో చేర్చుకోవడం చేతకాని పవన్ కల్యాణ్.. ఏకంగా రాష్ట్రాన్నే ఎలా పరిపాలించేస్తాడు.. అనే మీమాంస ప్రజల్లో ఉంటుంది.
జగన్ ను కాపీ కొట్టి వాతలు వేసుకుంటే.. ఒళ్లంతా వాతలు తేలుతాయే తప్ప.. పవన్ సీఎం కాలేడు. ప్రజలు ఆదరించేది నినాదాల్ని కాదు.. విధానాల్ని, వాటి కార్యచరణని. ఆ సంగతి ఆయన తెలుసుకోవాలి.