ష‌ర్మిల‌తో మాట్లాడ్డం ఇష్టం లేకేనా?

త‌న మాట‌ను ధిక్క‌రించి తెలంగాణ‌లో సొంత కుంప‌టి పెడుతున్న చెల్లి ష‌ర్మిల‌ను చూడడానికి, మాట్లాడ్డానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌డం లేదా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. కార‌ణాలేవైనా కావ‌చ్చు… అన్నాచెల్లెళ్ల మ‌ధ్య గ్యాప్…

త‌న మాట‌ను ధిక్క‌రించి తెలంగాణ‌లో సొంత కుంప‌టి పెడుతున్న చెల్లి ష‌ర్మిల‌ను చూడడానికి, మాట్లాడ్డానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌డం లేదా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. కార‌ణాలేవైనా కావ‌చ్చు… అన్నాచెల్లెళ్ల మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌న్న‌ది వాస్త‌వం. 

అది కాస్త తెలంగాణ‌లో ష‌ర్మిల ప్ర‌త్యేకంగా రాజ‌కీయ పార్టీ పెట్టే వ‌ర‌కూ దారి తీసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అన్నాచెల్లెళ్లు జ‌గ‌న్‌, ష‌ర్మిల ఇడుపుల‌పాయ‌లో క‌లుస్తార‌ని ఆశించిన వాళ్ల‌కు నిరాశే ఎదురు కానుంది.

తాజాగా సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ మారిన నేప‌థ్యంలో ప‌లు ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. తండ్రి జ‌యంతినాడు ష‌ర్మిల త‌న పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందులో భాగంగా ఆమె ఆ రోజు ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఇడుపుల‌పాయ‌కు వెళ్లి తండ్రి స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించి, ఆయ‌న ఆశీస్సులు తీసుకోనున్నారు. 

నిజానికి సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మొద‌టి షెడ్యూల్ ప్ర‌కారం ఆ స‌మ‌యానికి జ‌గ‌న్ ఇడుపుల‌పాయ‌లో ఉండాల్సింది. కానీ నిన్న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న మారింది. 8,9 తేదీల్లో ఆయ‌న అనంత‌పురం, క‌డ‌ప జిల్లాల్లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు.  

ఏడో తేదీ జ‌గ‌న్ క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి మూడు రోజులు అక్క‌డే ఉండాల్సింది. అయితే మారిన షెడ్యూల్ ప్ర‌కారం సీఎం జ‌గ‌న్ 8వ తేదీ   ఉదయం విజయవాడ నుంచి అనంతపురం జిల్లాకు చేరుకుని రైతు దినోత్స‌వంలో పాల్గొంటారు. 

మధ్యాహ్నం 1.15 గంట లకు పులివెందుల చేరుకుంటారు. 3.20 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 4.45 గంటల వరకు వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి అక్కడ బస చేస్తారు. జ‌గ‌న్ ఇడుపుల‌పాయ‌కు వ‌చ్చే స‌రికి సోద‌రి ష‌ర్మిల త‌న కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని తిరిగి క‌డ‌ప నుంచి ప్ర‌త్యేక చాప‌ర్‌లో హైద‌రాబాద్ చేరుకుంటారు.

వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ మారడంతో ష‌ర్మిల‌ను చూడ‌డం, మాట్లాడ్డం ఇష్టంలేకే, ఇలా చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత వ‌ర‌కూ వైఎస్సార్ జ‌యంతి నాడు ఆయ‌న కుటుంబ స‌భ్యులంతా ఇడుపుల‌పాయ‌లో క‌లుసు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. రాజ‌కీయాలు వాళ్ల మ‌ధ్య ఎడ‌బాటు పెంచుతున్నాయ‌నే ఆవేద‌న వైసీపీ శ్రేణుల్లో ఉంది. ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఇదంతా పొలిటిక‌ల్ డ్రామాగా కొట్టి పారేస్తున్నాయి.