వెరీ బ్యాడ్ అంటున్న సొట్ట‌బుగ్గ‌ల అంద‌గ‌త్తె

బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య అస‌మాన‌త‌లు రోజురోజుకూ పెరుగుతుండ‌డంపై సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇలాంటి ధోర‌ణులు వెరీ బ్యాడ్ అని ఆమె అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పారితోషికం విష‌యంలో…

బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య అస‌మాన‌త‌లు రోజురోజుకూ పెరుగుతుండ‌డంపై సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇలాంటి ధోర‌ణులు వెరీ బ్యాడ్ అని ఆమె అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పారితోషికం విష‌యంలో బాలీవుడ్‌లో ఎక్కువ వ్య‌త్యాసాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న అసంతృప్తినంతా బ‌య‌టికి వెళ్ల‌గ‌క్కారు.

ఇటీవల ఒక సినిమాలో సీతపాత్ర పోషించేందుకు బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ రూ.12 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇది సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే హీరోల రెమ్యునరేషన్‌పై స్పందించని వాళ్లు ఒక హీరోయిన్‌ పారితోషికం విషయంలో ఎందుకింత రచ్చ చేస్తున్నారంటూ తాప్సీ నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల పారితోషికాల‌పై నెల‌కున్న వివ‌క్ష‌పై తాప్సీ మాట‌ల్లోనే తెలుసుకుందాం.

‘ మహిళా నటులు పారితోషికం ఎక్కువగా అడిగితే అదో పెద్ద సమస్యగా త‌యారవుతుంది. ఇదే ఎవరైనా హీరో రెమ్యునరేషన్‌ పెంచితే మాత్రం అది ‘అతని సక్సెస్‌’గా అభివర్ణిస్తారు. నాతో ఇండ‌స్ట్రీలో ఒకేసారి వ‌చ్చిన వాళ్లు ఇప్పుడు నాకంటే 3-4రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. గుర్తింపు విషయంలోనూ అదే వివ‌క్ష‌. 

హీరోలకు స్టార్‌డమ్‌ వచ్చిన సమయంలో హీరోయిన్లకు గుర్తింపు రావడం లేదు. ఈ వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రేక్షకులు కూడా పురుష నటులతో పోలిస్తే మహిళా నటులను తక్కువగానే అభిమానిస్తారు. మహిళల ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలకు ఎక్కువగా బడ్జెట్‌ పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. 

ఎందుకంటే స్టార్‌ హీరోల సినిమాలతో పోల్చితే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు రాబడి తక్కువగా ఉంటుందని వాళ్ల భావన. వీటన్నింటికీ ప్రేక్షకులే ప్రధాన కారణం’ అని తాప్సీ వాపోయారు.

ఆమె ఆవేద‌న‌తో అంద‌రూ ఆఫ్ ది రికార్డుగా ఏకీభ‌విస్తారే త‌ప్ప‌, నోరు తెరిచి మాట్లాడ్డానికి మాత్రం జంకుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి తాప్సీ ఆక్రోశంపై ఇండ‌స్ట్రీ మున్ముందు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మ‌రి.