మాస్టారూ.. ఎందుకంత కంగారు!

వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చే సంధిసమయంలో.. చాలా వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆ సంస్కరణల యొక్క సత్ఫలితాలు వ్యవస్థ మీద చాలా మెండుగానే ఉంటాయి. సార్వజనీనమైన సిద్ధాంతం ఇది. అయితే ఇక్కడ మనం మరింత లోతుగా…

వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చే సంధిసమయంలో.. చాలా వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆ సంస్కరణల యొక్క సత్ఫలితాలు వ్యవస్థ మీద చాలా మెండుగానే ఉంటాయి. సార్వజనీనమైన సిద్ధాంతం ఇది. అయితే ఇక్కడ మనం మరింత లోతుగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. వ్యవస్థలో సంస్కరణలను వ్యతిరేకించే వారందరూ కూడా.. ఆ వ్యవస్థలోని లోపాలను వాడుకుని అనుచితమైన లబ్ధిని పొందుతున్న వారే! 

ఇప్పుడు.. పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాటును తీసుకువస్తున్న తరుణంలో ఉపాధ్యాయలోకం దానిని ఎందుకు వ్యతిరేకిస్తోందో అర్థం కావడం లేదు. ఈ విధానం పట్ల వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమయ్యే కొద్దీ.. వారి చిత్తశుద్ధిని, వారి పనితీరును కూడా అనుమానించాల్సిన పరిస్థితి.

ఆధునిక సాంకేతికత మన జీవినవిధానంలో అనేకానేక మార్పులను తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో సందేహం లేదు. రోజువారి పనులను సులభతరం చేసేస్తూ ఉంటుంది కూడా. పాఠశాలలు, ఉపాధ్యాయుల విషయంలో కూడా ఇది నిజం. డిజిటల్ పాఠాల దగ్గరినుంచి ఎన్నెన్నో సాంకేతిక ఏర్పాట్లు.. విద్యాబోధనను  మెరుగు పరుస్తున్నాయి. అదే క్రమంలో.. టీచర్ల హాజరుకు సంబంధించి.. ప్రభుత్వం తాజాగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసే కొత్త యాప్ ను తీసుకువచ్చింది. దీనిపట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. 

వీరు ఇంతగా ఎందుకు కంగారు పడుతున్నారో తెలియదు. ఎందుకంటే.. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా.. ఉదయం 9 గంటలలోగా పాఠశాల వద్దనుంచి టీచర్లు సెల్ఫీ తీసుకుని యాప్ లో అప్ లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే వారికి హాజరు పడుతుంది. సాయంత్రం బడినుంచి వెళ్లిపోయేప్పుడు కూడా అదేలా హాజరు వేయాలి. దీనివలన.. టీచర్లు తమలో తాము ఒక ఒప్పందం చేసుకుని.. లేటుగా బడికి రావడం. హాజరు కాకుండానే మరురోజు ఎటెండెన్సులు వేసుకోవడం.. ఇలాంటి లోపాయికారీ వ్యవహారాలు నడవవు. టీచరు విధిగా హాజరు కావాల్సిందే. ఎగ్గొట్టడం కుదరదు. మరో రకంగా చెప్పాలంటే.. నిజాయితీగా డుమ్మాలు కొట్టకుండా పనిచేసేవారికి ఇది చాలా మంచి ఏర్పాటు.

అయితే ఇబ్బందులూ ఉన్నాయి. సిగ్నల్ రాని ఊర్లు ఉంటాయి. యాప్ లో సమస్యలు ఉంటాయి. అసలు సిగ్నల్ వచ్చే అవకాశమే లేని మారుమూల, కొండల మధ్యలో ఉండే ఊర్లూ ఉంటాయి. ఇలాంటి సమస్యల గురించి మాత్రం ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడితేసబబుగా ఉంటుందిగానీ.. అసలు విధానాన్నే వ్యతిరేకిస్తే వారి చిత్తశుద్ధిని అనుమానించాల్సి వస్తుంది. 

అయితే ప్రభుత్వం ఈ విధానంలో చేసిన మరో పొరబాటు ఏంటంటే.. టీచరు తమ సొంత స్మార్ట్ ఫోనులో యాప్ డౌన్ లోడ్ చేసుకుని సెల్ఫీ అప్ లోడ్ చేయాలని చెప్పడం. ఇది నిజంగా ఇబ్బందికరం, లోపభూయిష్టం కూడా. స్మార్ట్ ఫోన్ లేని టీచర్లు ఉంటారు. ప్రతిఒక్కరికీ ఉండాలని రూలేం లేదు. దీనికి విరుగుడుగా.. ప్రభుత్వం తామందరికీ ట్యాబ్ లు ఇచ్చి.. సిగ్నల్ వచ్చేలా ఏర్పాటు చేసి అప్పుడు విధానం తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీటికి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సి ఉంది. 

ఒకసారి ఆచరణలోకి దిగితే.. మరిన్ని ఇబ్బందులు వెలుగులోకి వస్తాయి. వాటిని దిద్దుకుని విధానాన్ని ఆహ్వానించాలి. నిజాయితీగా, క్రమశిక్షణతో టీచర్లు విధులు నిర్వర్తించే వాతావరణాన్ని అభినందించాలి.