రాజకీయాల్లో సమయం, సందర్భోచితంగా సెటైర్స్ విసిరే నాయకులకు గుర్తింపు వుంటుంది. ఈ విషయంలో ఇటీవల కాలంలో యువ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రాటుతేలుతున్నారు. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సెటైర్స్ విసరడంలో గుడివాడ అమర్‌నాథ్ చురుగ్గా వుంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగన్‌పై పవన్ విమర్శలు గుప్పించారు.
ఇదే అవకాశంగా తీసుకున్న అమర్‌నాథ్ జనసేనానిపై సందర్భోచితంగా అదిరిపోయే పంచ్ విసిరారు. గుడివాడ విసిరిన పంచ్‌కు జనసేన అబ్బా అంటూ గిలగిల కొట్టుకుంటోంది. గుడివాడ ఘాటైన దెప్పి పొడుపుకు జనసేన నుంచి సరైన కౌంటర్ కరువైంది. గుడివాడ ఒకే ఒక్క మాటతో జనసేనాని పవన్‌ను చావు దెబ్బతీశారు.
“టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడు” అని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఒకే ప్రశ్న సంధించారు. ఇదొక్కటీ చాలదా జనసేన బానిస స్వభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ సూటిగా చెప్పగలరా అని గుడివాడ సవాల్ విసిరారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సందర్భం చూసుకుని గుడివాడ అమర్‌నాథ్ సమయస్ఫూర్తితో పవన్‌కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడు? అనే ఒకే ఒక్క ప్రశ్న అనేక ఆలోచనలను రేకెత్తించింది. చివరికి జనసేన శ్రేణుల్ని కూడా ఔను, నిజమే కదా అని తమ అంతరాత్మలను ప్రశ్నించుకునేలా చేసింది. పవన్‌కల్యాణ్ స్వాతంత్య్ర దినోత్సవం నాడు అనాలోచితంగా మాట్లాడి, అనవసరంగా యువ మంత్రి గుడివాడతో మాటలు పడాల్సి వచ్చింది.