తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి టీఆర్ఎస్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. బహిరంగ సభల్లో సర్వసాధారణంగా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తుంటారు. అదే సంప్రదాయాన్ని పాటించిన బండి సంజయ్ బహిరంగ సభలో దాడికి పాల్పడడం షాకింగ్ పరిణామం. ప్రజాసంగ్రామ పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రానికి బండి సంజయ్ చేరుకున్నారు.
ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగంలో కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదే గొడవకు దారి తీసింది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని బీజేపీ శ్రేణుల్ని అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. 8 ఏళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తూ మీరే చేశారని టీఆర్ఎస్ శ్రేణులు నిలదీశారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య మాటామాటా పెరిగి, పరస్పరం దాడులకు దిగారు.
బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడులు చేశాయి. ఈ ఘటనలో టీఆర్ఎస్ శ్రేణులకి స్వల్పంగా, అలాగే బీజేపీ శ్రేణులకి తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తగాయాలైన వారిని వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రలో పోలీసుల రక్షణ లేకపోవడంపై డీజీపీకి బండి సంజయ్ ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కార్యకర్తలే రక్షణగా ఉంటారని ఆయన అన్నారు.