వీవీఐపీలు, వీఐపీల సేవలో టీటీడీ తరిస్తోంది. వరుస సెలవులు రావడంతో తిరుమల కిటకిటలాడుతోంది. సాధారణ రోజుల్లో కూడా తిరుమలేశుని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ వుంటారు. ఇక నాలుగైదు రోజులు సెలవులు వస్తే…. ఇక భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీవారి దర్శనానికి 48 గంటలు పడుతోందని, కావున భక్తులు రావద్దని పరోక్షంగా టీటీడీ అధికారులు ఊదరగొడుతుంటారు.
అయితే ఈ హిత వచనాల్నీ సామాన్య భక్తులకే. డబ్బు, రాజకీయ, అధికార పలుకుబడి కలిగిన వాళ్లకు మాత్రం టీటీడీ నిబంధనలేవీ వర్తించవు. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు ఏకంగా 150 మందితో ప్రొటోకాల్ దర్శనం చేసుకెళ్లడం వివాదాస్పదమైంది.
తాజాగా మరో మంత్రి ఉషశ్రీ చరణ్ తానేం తక్కువని తిరుమలలో బలప్రదర్శనకు దిగారు. వీఐపీ బ్రేక్‌దర్శనాలను ఈ నెల 21వ తేదీ వరకూ రద్దు చేశామని ప్రకటించిన టీటీడీ…. ఉషశ్రీ చరణ్ సిఫార్సుకు ఎలా తలొగ్గిందనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి 50 బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు.. 10 సుప్రభాతం టిక్కెట్లను టీటీడీ జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భక్తులు రోజుల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, ఇవేవీ పట్టించుకోకుండా అమాత్యుల సేవలో టీటీడీ ఉన్నతాధికారులు తరించడం ఏంటని పౌర సమాజం నిలదీస్తోంది.
టీటీడీ ఉన్నతాధికారులు చెప్పే మాటలకు, చేష్టలకు పూర్తి విరుద్ధంగా ఉందని సామాన్య భక్తులు మండిపడుతున్నారు.