పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం అక్టోబర్ నుంచి రాజకీయ యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించడంతో ఓ హీరో, ఓ డైరక్టర్ దిగాలు పడిపోయారు.
పవన్ ను నమ్ముకుని నటుడు సముద్రఖని తన చేతిలో వున్న సినిమాలు అన్నీ వదిలేసుకున్నారు. దర్శకత్వం మీద దృష్టి పెట్టి కూర్చున్నారు. జూలైలో ప్రారంభం అనుకున్న సినిమా ఆగస్ట్ సగానికి చేరినా అతీగతీ లేకుండా వుండిపోయింది. కేవలం ఇరవై రోజులు వర్క్ చేస్తే చాలు పవన్ కు 50 కోట్లు చేతిలోకి వస్తాయి. అడ్వాన్స్ అందనే అందింది. కానీ ఆ ఇరవై రోజులు కూడా కేటాయించలేకపోతున్నారు.
ఈ సినిమా కోసమే మరే సినిమా మీదకు వెళ్లవద్దని హీరో సాయి ధరమ్ తేజ్ కు ఆదేశాలు జారీ చేసారని వార్తలు వచ్చాయి. అవి నిజమే అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా ప్లాన్ చేసిన దగ్గర నుంచి సాయి ధరమ్ తేజ్ అలా ఇంట్లోనే వుండిపోయారు. చేయాల్సిన రెండు సినిమాలు అలా వుండిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో ఆయనకూ తెలియడం లేదు.
మరో నెలన్నర సమయం వుంది. ఈ నెలన్నరలో పవన్ కనుక ఇరవై రోజులు కేటాయిస్తే ఆ సినిమా వుంటుంది. వినోదహితం హక్కులు తీసుకుని డబ్బులు ఖర్చు చేసిన పీపుల్స్ మీడియా సంస్థ ఊపిరి పీల్చుకుంటుంది. లేదూ అంటే పాపం, ఈ హీరో, ఆ డైరక్టర్ ఏం చేస్తారో మరి?