మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకే బడ్జెట్ పెరిగితే తిరిగి రాబట్టుకోవడం కష్టంగా మారుతున్న రోజులివి. గడిచిన నాలుగేళ్లలో మహేష్ కెరీర్ లో కాస్ట్ ఫెయిల్యూర్స్ పడ్డాయి. కళ్లముందు ఇలాంటి సాక్ష్యాలు పెట్టుకొని కూడా గోపీచంద్ జాగ్రత్తపడడం లేదు. తన సినిమాల బడ్జెట్ పెరుగుతుంటే ఏమీ చేయలేకపోతున్నాడు.
ప్రస్తుతం తిరు దర్శకత్వంలో చాణక్య అనే సినిమా చేస్తున్నాడు గోపీచంద్. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ అంచనాల్ని దాటిపోతోంది. అనుకున్న బడ్జెట్ లో ఇప్పటికే 70శాతానికి పైగా ఖర్చయింది. షూటింగ్ మాత్రం 50శాతం మాత్రమే పూర్తయింది. అది కూడా టాకీ పార్ట్. సో.. మిగతా బ్యాలెన్స్ పూర్తవ్వాలంటే అదనంగా ఇంకొంత పెట్టాల్సిందే.
అసలే గోపీచంద్ కు మార్కెట్ పడిపోయింది. చివరికి శాటిలైట్ డీల్స్ కూడా కుదరడం లేదంటే, ఈ హీరో పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఇలాంటి టైమ్ లో చాణక్య బడ్జెట్ చేయిదాటిపోవడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. రేపు సినిమా థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, హీరో మార్కెట్ తో పోల్చిచూసుకుంటే రిటర్న్స్ అంతగా ఉండకపోవచ్చు. ఈ లెక్కలన్నీ సినిమా హిట్ అయినప్పుడు మాత్రమే.
గతంలో గౌతమ్ నందా విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ సినిమాకు భారీగా ఖర్చుపెట్టారు. దీంతో సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఇలాంటి చేదు అనుభవం పెట్టుకొని కూడా చాణక్య సినిమా బడ్జెట్ పెరిగిపోతుంటే గోపీచంద్ ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న అనీల్ సుంకర దీన్నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.