ఒక పులి పాదయాత్ర ఇది. సినిమా టైటిల్ అయితే కాదు. కాకినాడ నుంచి అలా మొదలైన పెద్ద పులి సంచారం అలా అన్ని ఊళ్ళూ దాటుకుంటూ విశాఖ సరిహద్దులను చూసుకుంటూ గత నెలన్నర రోజులుగా విశాఖలో జనాలను హైరానా పెట్టేస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద పులి మొత్తానికి మొత్తం చుట్టేసింది. ఒక రోజు ఒక ఊరిలో కనిపిస్తే మరుసటి రోజు మరోచోట ప్రత్యక్షం అవుతోంది. పెద్ద పులిని పట్టుకోవాలని అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.
ఇంకో వైపు పెద్ద పులి బారిన పడి పశువులు మాత్రం భారీగా చనిపోతున్నాయి. పులి అడుగు జాడలు చూసి ఫలానా చోట ఉందని భావించిన అధికారులకు షాక్ ఇస్తూ మరో చోట తన ఉనికిని చాటుకుంటూ ముప్పతిప్పలు పెడుతోంది.
పులి కోసం ఒక బోనుని తెప్పించారు. అయినా అది చిక్కలేదు. ఇపుడు బోను బయటకు కనిపించకుండా సరుగుడు కొమ్మలు, ఇతర పచ్చని మొక్కలతో కప్పేసి మరీ పులిని రప్పించాలని అటవీ శాఖ అధికారులు సరి కొత్త ప్లాన్ వేశారు. సీసీ కెమరాలు కూడా చుట్టుపక్కల అమర్చి మరీ నిఘా పెట్టారు.
అయినా పులి మాత్రం చిక్కడంలేదు. అధికారుల లెక్క ప్రకరం పులి పాదయాత్రకు వంద రోజుల పైదాటిందట. ఇపుడు రాజకీయ నేతల పాదయాత్రల సీజన్ అంతటా సాగుతోంది మరి. ఈ పెద్ద పులి కూడా జిల్లాలను దాటుకుంటూ తన పాదయాత్రను సక్సెస్ ఫుల్ గా చేస్తోంది అంటున్నారు. మరి పులి చిక్కేదెన్నడో, జనాల గుండెలు చిక్కబెట్టుకునేదెన్నడో.