హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎట్టకేలకు ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు. కర్నూలులో ఆయనకు కురబ సంఘం తరపున ఘన స్వాగతం పలికారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం రాజకీయాల పరిధి దాటి కులం రంగు పులుముకుంది. చంద్రబాబు సామాజికవర్గంలోని కొందరు తనపై కుట్ర చేసి, ఫేక్ వీడియోలను సృష్టించారని మాధవ్ ప్రధాన ఆరోపణ. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఆయనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడంతో మాధవ్ చెలరేగిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, ఎల్లో మీడియాధిపతులపై రెచ్చి పోయారు. కులపరమైన గొడవలు సృష్టించేలా తాను మాట్లాడలేదన్నారు. ఐ టీడీపీ సోషల్ మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు, ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీవీ5 ఎండీ బీఆర్ నాయుడు కలిసి తనపై ఫేక్ వీడియోలను ప్రసారం చేశారని విమర్శించారు.
ఆ ఇద్దరు మీడియాధిపతులు చంద్రబాబుతో చేతులు కలిపారని ఆరోపించారు. వీరంతా కలిసి బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తున్నారని విమర్శించారు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు పచ్చ చానళ్లు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబు కుట్రలేవీ ఫలించలేదన్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రెస్మీట్లో చెప్పిన అంశాల్ని మాధవ్ బాగా ఒంటబట్టించుకున్నట్టున్నారు. ఆ విషయాల్నే పదేపదే మాధవ్ చెబుతున్నారు.
తనపై న్యూడ్ వీడియోల సృష్టిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల దాడిగా చిత్రీకరించే ప్రయత్నాల్ని మాధవ్ వేగవంతం చేశారు. మరోవైపు ఎన్ని విమర్శలు వచ్చినా మాధవ్‌కు కురబ సంఘం నేతలు ఘన స్వాగతం పలకడంలో వెనుకంజ వేయలేదు. తాజా రాజకీయ పరిణామాలపై ఏంటో అంతా కొత్తగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.