ఎట్టకేలకు జనసేనాని పవన్‌కల్యాణ్ జనంలోకి వస్తున్నట్టు ఆ పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దసరా నుంచి పవన్‌కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పవన్‌కల్యాణ్ నిలకడలేని రాజకీయం కారణంగా, ఇప్పటికీ ఆయన జనంలోకి వస్తారంటే నమ్మలేని పరిస్థితి.
పవన్ ఇట్లే చెబుతుంటారులే, ఆయన వచ్చినప్పటి మాట అని సొంత పార్టీ నేతలు కూడా పెదవి విరుస్తుంటారు. కానీ ఈ దఫా మాత్రం జనంలోకి వెళ్లాలని పవన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. పవన్ రాజకీయ భవిష్యత్‌తో పాటు జనసేన ఉనికికి రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లలోనైనా జనసేన నేతలు గెలిస్తేనే, ఆ పార్టీకి భవిష్యత్ వుంటుంది. లేదంటే ఏపీ రాజకీయ చరిత్రలో ముగిసిపోయిన అధ్యాయం కింద జనసేనకు ఓ పేజీ వుంటుంది.
ఈ కారణంతోనైనా పవన్‌కల్యాణ్ తప్పక జనంతో మమేకం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇవాళ జనసేన ఐటీ సమ్మిట్ నిర్వహించింది. అనంతరం మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమైందన్నారు. ఐటీ వింగ్‌లోని ప్రతి జనసేన కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 నుంచి యాత్ర ప్రారంభిస్తారన్నారు. ఈ యాత్రను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలోనే జనసేన ఐటీ వింగ్ నిపుణులతో నాదెండ్ల సమావేశమయ్యారు.
నాదెండ్ల చెప్పినట్టు ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా అత్యంత శక్తిమంతంగా పని చేస్తోంది. వీధుల్లోకి వెళ్లి ఉద్యమించడం ఎంత ముఖ్యమో, దానికి విస్తృత ప్రచారం కూడా అంతే ప్రధానం. ఆ విషయాన్ని గుర్తించడం వల్లే పవన్ యాత్రపై సోషల్ మీడియా వేదికగా ఉద్యమం సాగించాలని జనసేన నిర్ణయించుకుంది.