విశాఖ రైల్వే జోన్ ఎక్కడ ఉంది అని ఎవరూ కంగారు పడనవసరం లేదు. హాయిగా రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్ చూస్తే చాలు వరస నంబర్ లో 18వ జోన్ గా దక్షిణ కోస్తా జోన్ కనిపిస్తుంది.దాంతోనే సంతోషపడిపోవచ్చు.
ఇంతకీ జోన్ కధ ఎందాకా వచ్చింది అంటే వెబ్ సైట్ దాకా అనుకోవచ్చేమో. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ప్రధాని మోడీ విశాఖ వచ్చి మరీ జోన్ ఇచ్చేస్తున్నమని భారీ సభలో ప్రకటించారు.
నాటి నుంచి జోన్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే అనుకోవాలి. ఇక రైల్వే బడ్జెట్ లో జోన్ కి ఏమైనా కేటాయిస్తున్నారా అంటే చాలానే అని చెప్పుకోవాలి. గత ఏడాది మూడు కోట్లూ, ఈ ఏడాది నలభై లక్షలు. ఇలా ఏ ఏటికి ఆ ఏడు కుదించుకునిపోతోంది కేటాయింపు.
ఈ సొమ్ము అధికారుల జీతభత్యాలకే సరిపోవు అంటున్నారు. మరి జోన్ కి మౌలిక సదుపాయాల కల్పన, భవనాల నిర్మాణం వంటి వాటికి నిధులు ఎక్కడివి అంటే ఇస్తారనే ఆశించాలి. అంటే 2019లో జోన్ ప్రకటన వచ్చింది కాబట్టి అదృష్టం బాగుంటే 2029 నాటికి విశాఖలో జోన్ కూత వినిపిస్తే చాలా తొందరగానే వచ్చినట్లేమో.