కరోనా కారణంగా సీఎం జగన్ జనాల్లోకి రావడం బాగా తగ్గిపోయింది. అంతకుముందు నవరత్నాల్లో ప్రతి పథకాన్ని ఒక్కో జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించి, భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారాయన.
అంతకంటే ముందు రచ్చబండ కార్యక్రమాన్ని కూడా షురూ చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల జగన్ ప్లాన్స్ అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అలా కొద్దికాలంగా జగన్ కేవలం తాడేపల్లికే పరిమితం కావాల్సి వచ్చింది.
అక్కడినుంచే అధికారులతో సమావేశం అవుతూ ఆన్ లైన్ లోనే అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నారు ముఖ్యమంత్రి. అయితే ఇన్నాళ్లకు ఆయన జనంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది.
తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు కడప, అనంతపురం జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి కార్యక్రమం తర్వాత ఆయన జిల్లాల్లో పర్యటిస్తారు.
కడప, అనంతపురంతో పాటు, బద్వేలులో కూడా సీఎం పర్యటన ఖరారైంది. ఇటీవలే బద్వేల్ ఎమ్మెల్యే మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారుతోంది. దీంతో అక్కడ సీఎం జగన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. రాయలసీమ జిల్లాలతో మొదలు పెట్టి, దశలవారీగా రాష్ట్రం మొత్తం చుట్టే ఆలోచనలో ఉన్నారు జగన్.
రెండేళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలలోనే మునిగితేలిన జగన్, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. కరోనా కారణంగా ఈమధ్య ఆయన ఏ కార్యక్రమానికీ నేరుగా హాజరు కాలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో రాయలసీమ జిల్లాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. సీఎం పర్యటనతో సీమ నేతల్లో కొత్త ఉత్సాహం వస్తుంది.
మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం కూడా ఇటీవల పెద్దదైంది. ఈ పథకం ఆగిపోతే సీమకు తీవ్ర నష్టం జరుగుతుంది. కానీ తెలంగాణ మాత్రం జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని వృథా చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ సీమ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది.