సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ కంటే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజే మేలనిపించేలా ఉన్నారు. ఎల్లో చానల్ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల ఎగిరేసి నరుకుతానని తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను రామకృష్ణ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటి దురుసే ఆయన్ను జైలుపాలు చేసింది. ఇటీవల జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. అయినప్పటికీ ఆయనలో మార్పు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ అమలుకాని హామీలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. జగన్కు మతిమరుపు, మాయరోగం పట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలను జగన్ తన చేతుల్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని అమలు చేయకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తీరు దళితులకు చాలా ప్రమాదకరమన్నారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని రామకృష్ణ విమర్శించారు. జగన్ దేశమంతా, ప్రపంచమంతా తిరుగుతూ అప్పులు చేస్తున్నారని, 20 ఏళ్ల నుంచి న్యాయమూర్తిగా పనిచేస్తున్న తన ఫిర్యాదుపైనే పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీని ఆయన ప్రశ్నించారు.
జగన్ తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు తన స్వగ్రామం నుంచి అమరావతికి 660 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబుపై నంద్యాల సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై తాను చేసిన పిర్యాదుపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసే వరకు నిద్రపోనని హెచ్చరించారు.
జగన్పై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు 660 కి.మీ. పాదయాత్ర చేయడం ఎందుకో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడ్డం లేదు.
గత కొంత కాలంగా వైసీపీ ఇచ్చిన హామీల అమలుపై జగన్ ప్రభుత్వానికి ఆయన లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. అంతే తప్ప, గతంలో మాదిరిగా ఆయన అవాకులు చెవాకులు పేలడం లేదు. కానీ జైలుకెళ్లి వచ్చిన సస్పెండ్ అయిన జడ్జిలో మాత్రం జైలు జీవితం ఎలాంటి మార్పు తీసుకురానట్టే కనిపిస్తోంది.