గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని ఎంత దూరం సాగదీస్తే అంత లాభం అనుకుంటోంది తెలుగుదేశం. పాపం.. ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ తనే భుజాల మీద వేసుకుని చేస్తోంది. కాకపోతే.. వారి కష్టాన్ని ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది మాత్రమే ప్రశ్న. ఒక ఫోన్లో ప్లే అవుతుండగా మరో ఫోన్ తో చిత్రీకరించిన వీడియో గనుక దానిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పరిగణించలేం అని.. ఒరిజినల్ వీడియో దొరికిన తర్వాత.. తదుపరి కార్యచరణ ఉంటుందని ఎస్పీ ప్రకటించినప్పటికీ.. అంతవరకు ఆగే ఓపిక తెలుగుదేశానికి లేదు. ఫోరెన్సిక్ పరీక్షల పేరుతో ఒక చిన్న డ్రామా ఎపిసోడ్ నడిపించి.. ‘అయిపోయింది.. అయిపోయింది’ ఇక శిక్ష వేసేయండి.. అంటూ యాగీ చేస్తున్నారు.
గోరంట్ల మాధవ్ కు సంబంధించిన వీడియో ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడానికి తగినట్టుగా లేదు అనేది పోలీసుల వాదన. ప్రతిపక్షాలు ఏం చేయాలి.. ఈ వీడియోను మొదటిసారిగా ప్రచారంలో పెట్టిన వ్యక్తిని పట్టుకోవడం మరీ కష్టం కాదు గనుక.. తక్షణం అతడిని అరెస్టు చేస్తే.. అతని ద్వారా ఒరిజినల్ వీడియో ఎక్కడ ఉన్నదో కూడా తెలుస్తుందని డిమాండ్ చేయాలి. అతడిని పట్టుకోలేకపోతే.. పోలీసుల సదరు వైఫల్యాన్ని ఎండగట్టాలి. అంతేతప్ప ఫోరెన్సిక్ పరీక్షలు మేమే చేయించేస్తాం.. అంటూ ఒక డ్రామా ఎపిసోడ్ నడిపిస్తే ఎలా?
తెలుగుదేశానికి చెందిన స్టాఫ్ ఆర్టిస్ట్ పట్టాభిరామ్, తెలుగు మహిళ వంగలపూడి అనిత కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. పట్టాభి రామ్ సోదరుడు పోతిని ప్రసాద్ ద్వారా అమెరికా ఫ్లోరిడాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో వారు పరీక్ష చేయించారట. సదరు వీడియో అన్ ఎడిటెడ్ అని నివేదిక వచ్చినట్టుగా ప్రకటించారు. పోలీసులు ఇప్పుడేం చెబుతారనేది వారి ప్రశ్న.
ఫ్లోరిడాలో ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉన్న మాట వాస్తవం. దానిని జిమ్ స్టాఫోర్డ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మాట కూడా వాస్తవం. కానీ.. పట్టాభిరామ్ అనే మేధావి సెలవిచ్చినట్టుగా ఆయన స్వయంగా ఫోరెన్సిక్ నిపుణుడు కాదు. ఆడియో, వీడియో రికార్డింగుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజినీరు మాత్రమే. స్టుడియో రికార్డింగులు, లైవ్ ఈవెంట్ల రికార్డింగులు చేస్తూ ఉంటారు. ఆయన ప్రధాన వ్యాపారం అదే! ఆడియో రికార్డింగులో అనుభవం ముదిరిపోవడం వల్ల.. అందులో హెచ్చుతగ్గులను తేడాలను పట్టుకోగల స్కిల్ తో ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టుకున్నారు. అది ఆయన ప్రెవేటు దుకాణం. అందులో కోర్టు సర్టిఫై చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఉజ్జోగం మాత్రమే చేస్తారు. అలాంటి ప్రెవేటు ఫోరెన్సిక్ దుకాణాల వ్యవహారాలు చర్చకు మాత్రమే పనికి వస్తాయి. వాదనలకు మాత్రమే పనికి వస్తాయి. శిక్షలు తేల్చడానికి కాదు.
తెలుగుదేశం పార్టీ అధినేత, టెక్నాలజీని కనిపెట్టింది తానే అని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఈ ఆలోచన పట్టాభిరామ్ కు అందించారట. ఆయన తమ్ముడిగారిని పురమాయించి.. ఫ్లోరిడాలోని జిమ్ స్టాఫోర్డ్ తో ఫోరెన్సిక్ పరీక్షలు చేయించారట. గోరంట్ల ఎపిసోడ్ ను మరికొంత కాలం సాగదీయడానికి తెలుగుదేశం వేస్తున్న ఎత్తులుగానే ఇది కనిపిస్తోంది.
‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబునాయుడు గారు సెలవిచ్చిన స్వరం.. ఆయనలో మూర్తీభవించిన పరాకాష్టగా.. ప్రజాస్వామ్య సమాజంలో ఆయన పరువును తీసినప్పుడు.. చంద్రబాబు ఇమేజిని బట్టలిప్పదీసి నడిబజార్లో నిలబెట్టినప్పుడు.. సదరు చంద్రభక్తులు పాపం పట్టాభిరాం, ఆయన సోదరుడు పోతిన ప్రసాద్ లకు ఈ జిమ్ స్టాఫోర్డ్ గారి ఫోరెన్సిక్ సాయం ఎందుకు గుర్తుకు రాలేదు. చంద్రబాబు స్వరం ఆయనది కాదని, అది క్రియేటెడ్ ఆడియో రికార్డింగ్ అని.. ఇదే ఎక్లిప్స్ తో పరీక్ష చేయించి.. తమ నాయకుడు చంద్రబాబు నిప్పు అని చాటుకుని ఉండవచ్చు కదా.. అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
ఫోరెన్సిక్ డిపార్టుమెంటును ఎటూ తెలుగుదేశం చేతుల్లోకి తీసేసుకుంది, ఇక విచారణ జరిపి చార్జిషీటు వేయాల్సిన పోలీసు, వాదప్రతివాదాలు విని శిక్ష వేయాల్సిన జుడిషియరీ డిపార్టుమెంటులను కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో పెట్టేస్తే.. వారికి నచ్చిన ఫోరెన్సిక్ నివేదిక తెప్పించినట్టుగానే.. నచ్చిన శిక్ష్లలు కూడా వేసుకుంటారని సెటైర్లు పేలుతున్నాయి.
చంద్రబాబు ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’’ ఆడియోను కూడా అదే ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుదాం.. వారిచ్చే నివేదికకు తెలుగుదేశం కట్టుబడి ఉంటుందా? అని కూడా సవాళ్లు విసురుతున్నారు!