ఇప్పటికే పలు పార్టీల్లో చేరినట్టుగా ఉన్నారు నటి జీవిత. ఒక్కో పార్టీలో రెండు, మూడు సార్లు కూడా చేరడం కూడా వీరి ప్రత్యేకత అనుకోవాలి! 2009 సమయంలో ప్రజారాజ్యం పార్టీపై తమ అభిప్రాయాన్ని తెలపడంతో వీరు హఠాత్తుగా రాజకీయ తెరపైకి వచ్చారు. చిరంజీవి రాజకీయాన్ని వీరు సమర్థించకపోవడంతో.. జీవితారాజశేఖర్ లపై మెగాభిమానుల దాడితో వ్యవహారం వేడెక్కింది. ఆ వ్యవహారంతో వీరికి కాంగ్రెస్ వైపు చాలా తేలికగా అవకాశం దక్కింది. ఇలా జీవితారాజశేఖర్ లకు మెగాభిమానులు మంచి అవకాశం ఇచ్చారు.
2009లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో జీవితకు స్థానం దక్కింది. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణంతో వీరు వైఎస్ జగన్ వెంట నడిచారు. కొన్నాళ్లకు జగన్ ను విమర్శిస్తూ బయటకు వచ్చారు. ఆ పై తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ తరఫునా పెద్దగా అవకాశం రాకపోవడంతో.. బీజేపీకి దగ్గరయినట్టుగా ఉన్నారు. ఆ వెంటనే 2019 ఎన్నికల ముందు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. ఆ పార్టీ ఏపీకి పరిమితం కావడంతో.. జీవితారాజశేఖర్ లు రాజకీయం చేయడానికి ఏమీ లేకుండా పోయింది. ఉన్నట్టుండి జీవిత బండిసంజయ్ ను కలిసి బీజేపీ కండువా వేయించుకున్నారు.
కేసీఆర్ పాలనను విమర్శించారు. తెలంగాణకు బీజేపీతోనే ముక్తి అన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సై అని జీవిత ప్రకటించేశారు. మొత్తానికి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మీదుగా మళ్లీ జీవిత బీజేపీ వైపు వెళ్లినట్టుగా ఉన్నారు!
త్వరలోనే జయసుధ బీజేపీలోకి చేరబోతోందనే టాక్ నడుస్తున్న తరుణంలో అంతకన్నా వేగంగా జీవిత వెళ్లి బీజేపీలోకి చేరిపోయారు. మరి ఈ పార్టీలో జీవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో!