టైటిల్: కార్తికేయ 2
రేటింగ్: 2.5/5
తారాగణం: నిఖిల్, అనుపమ, అనుపమ్ ఖేర్, తులసి, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, ఆదిత్య మీనన్ తదితరులు
కెమెరా: కార్తిక్ ఘట్టమనేని
ఎడిటింగ్: కార్తిక్ ఘట్టమనేని
సంగీతం: కాలభైరవ
నిర్మాత: టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: చందు మొండేటి
విడుదల తేదీ: 13 ఆగష్ట్ 2022
సాధారణంగా నిఖిల్ చిత్రాలు రొటీన్ కథాంశాలుండవు. ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. పైగా కార్తికేయ1 కి సీక్వెల్ కనుక అంచనాలు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. శ్రీకృష్ణుని ద్వారక నేపథ్యంలో సినిమా కనుక ఫ్యాంటసీ ఫిక్షన్ కి చాలా స్కోపుంటుంది. రక్తి కట్టించడానికి చాలా అంశాలు క్రోడీకరించవచ్చు. ఇంతకీ ఎలా ఉందొ చెప్పుకుందాం.
ఒకానొక ఆర్కియాలజిస్ట్ గ్రీస్ దేశంలోని ఒక లైబ్రరీలో వెతికి పట్టుకున్న ఒక ప్రాచీన గ్రంథంలోని విషయంతో సినిమా మొదలౌవుతుంది. ఆ విషయానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి కాలానికి లింకుంటుంది. ఆ లింకుతో ఇక్కడి హీరోకి కూడా తెలియకుండా లింకు ఏర్పడుతుంది. ఇంతకీ మన హీరో ఒక వైద్యుడు. కార్తికేయ 1 లో లాగ సైంటిఫిక్ టెంపెర్మెంట్ ఉన్నవాడు. అయితే ఆ కథకి, ఈ కార్తికేయ2 కి సంబంధమేమీ లేదు.
కథావస్తువు ఏదైనా కావొచ్చు, కథనం నడిపేటప్పుడు ఒక ఆర్గానిక్ ఫ్లో ఉండాలి. సన్నివేశాలు వరసగా పేర్చుకుంటూ పోతే ప్రేక్షకులకి అర్థమవుతుందిలే అనుకోవడం పొరపాటు. సినిమా అంటే కేవలం అర్థం కావడం కాదు, అనుభూతి కలగించడం. ఆ అనుభూతిని ఆద్యంతం కలిగిస్తే ఉత్తమచిత్రమవుతుంది. క్లైమాక్స్ లో ఒక అరగంట మాత్రమే కలిగిస్తే కేవలం పర్వాలేదనిపిస్తుంది. కానీ ఇలాంటి చిత్రాలు చాలా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో, బలమైన సన్నివేశాలతో నడపాల్సినవి. ఇందులో ప్రధానమైన మైనస్ ఏంటంటే ప్రధామర్థంలో చాలాసేపటి వరకు కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ఎష్టాబ్లిష్ కాకపోవడం.
సనాతన ధర్మంలో ఎంతో సైన్స్ ఉందని, దానిని పాశ్చాత్యులు పుక్కిటిపురాణాలుగా తోసిపారేసారని థియరీ ఎప్పటి నుంచో ఉంది. దానికి బలాన్ని చేకూరుస్తూ ఎందరో వక్తలు మాట్లాడుతున్నారు, రచయితలు రాస్తున్నారు. అయితే దానిని సినిమాగా చెప్తున్నప్పుడు నిజమనిపించేలా ఉండాలి, గుండెలకి హత్తుకోవాలి, కళ్లు చెమర్చాలి, చర్చించుకునేలా చెయ్యాలి (ఒక కాశ్మీర్ ఫైల్స్ లాగ).
ప్రధమార్థంలో చాలా భాగం సాగతీతగా అనిపిస్తుంది. ఎమోషన్ ఫీలయ్యే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా రాదు. చాలాసేపటి వరకు కాన్-ఫ్లిక్ట్ ఏమిటో అర్థం కాక హుక్ పాయింట్ కోసం ఓపిగ్గా వేచి చూసేలా చేస్తుంది.
ఇందులో విలన్లున్నారా అంటే కంటికి కనిపిస్తుంటారు తప్ప, ఎమోషనల్ యాంగిల్లో వాళ్లు విలన్లనిపించరు. ఎందుకంటే ఇందులో విలన్లందరూ కృష్ణభక్తులే.
కథావస్తువుగా ఈ లోపాల్ని పక్కనపెడితే క్లైమాక్స్ లో అరగంటసేపు కూర్చోబెట్టేలా ఉంది. అయితే చాలావరకు గోపీచంద్ “సాహసం” గుర్తొస్తొంది. అదే ఫార్మాట్ ని వాడేసారు.
అతిథి పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించి చెప్పిన డయలాగులో విషయమున్నా దానిని మరింత ఎమోషనల్ గా ప్రేక్షకులకి ఎక్కించాల్సింది. దానికోసం కాస్త లెంగ్త్ ఎక్కువైనా పర్వాలేదు. కాశ్మీర్ ఫైల్స్ లో ఇలాంటి సందర్భంలో హీరో సుమారుగా పావుగంట స్పీచిస్తాడు. అదే సినిమాకి హైలైటయ్యింది. ఇక్కడ దర్శకుడు ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
టెక్నికల్ అంశాలకొస్తే కాలభైరవ నేపథ్య సంగీతం మరింత బలంగా ఉండాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్‌బంప్స్ తెప్పించగలిగే సీన్లు చాలానే ఉన్నాయి. కానీ ఆ అవకాశాన్ని సంగీత దర్శకుడు పెద్దగా వాడుకోలేదు.
ఇక పాట విషయానికొస్తే కథనానికి అడ్డుపడేలా ఉంది తప్ప ఉపయోగపడలేదు.
కెమెరా వర్క్, గ్రాఫిక్స్, లొకేషన్స్ అన్నీ రిచ్ గా ఉన్నాయి.
దర్శకుడిగా చందు మొండేటి మరింత గ్రిప్పింగ్ గా చేసుండాల్సింది. ఒకానొక ప్రాచీన వస్తువు జాడను కనుగొనే ప్రయాణమే కథంతా. అయితే కథకి అవసరం లేని భూతవైద్యుడి సీనొకటి పెట్టి హీరో చేత ఆడవాళ్ల మనసుని అర్థం చేసుకోవడమనే విషయం గురించి ఏదో డయలాగ్ పెట్టారు. ఇలాంటివే కొన్ని అమెచ్యూరిష్ గా, ఫోర్స్డ్ గా అనిపించాయి.
హీరో నిఖిల్ తన పాత్రకి న్యాయం చేసాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కంటే సైడ్ కిక్ లాగ ఉంది. శ్రీనివాసరెడ్డి కొన్ని టైమింగ్ పంచులతో నవ్వించాడు. వైవా హర్ష ఓకే. ఆదిత్య మీనన్ పాత్ర ఏమిటో వివరంగా లేదు. అనుపమ్ ఖేర్ ఉన్న కాసేపు బాగానే ఉంది. తల్లిగా తులసి నటన పర్ఫెక్ట్ గా ఉంది.
సనాతనధర్మం మీద గౌరవం, శ్రీకృష్ణుడి మీద భక్తి కారణంగా ఈ సినిమా అక్కడక్కడ నచ్చుతుంది తప్ప సహజంగా ఇందులో బలహీనతలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా రొటీన్ రొడ్డకొట్టుడు కాకుండా ఔటాఫ్ ది బాక్స్ కథను ఎంచుకుని తీసినందుకు నిర్మాతలను, దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎక్కడా అశ్లీలత లేని రెలిజియస్ థ్రిల్లర్ కనుక పిల్లలతో చూడగ్గదిగా ఉంది.
బాటం లైన్: అక్కడక్కడ బాగుంది