ఆయన వైసీపీకి చెందిన మాజీ మంత్రి. మూడేళ్ళ పాటు మంత్రిగా అధికార వైభోగాలు అనుభవించారు. ఇపుడు మాజీ అయినా ఆయన హోదాకు ఏ మాత్రం భంగం కలగకుండా వైసీపీ ఆయన్ని విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసింది. ఆయనే వైసీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు.
ఆయన చాలా సార్లు నిజాలే చెబుతారు. ఆయనలో ఆవేశం పాలు కూడా హెచ్చు. అందుకే తన మెదడులో దొలిచిన మాటను నోటితో పలికించనిదే నిద్రపోరు. ఆయన తాజాగా భీమిలీ నియోజకవర్గంలోని ఒక మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ కొన్ని నిజాలు చెప్పారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది ఎవరు అంటే ఒకరు ప్రజా ప్రతినిధులు, రెండు అధికారులు అని అవంతి కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన అభివృధి పనులను పూర్తిచేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు కూడా వాటి విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా ఉంటే చివరాఖరుకు అన్నీ కలసి ప్రభుత్వానికే మచ్చ తెస్తాయని అవంతి గట్టిగానే క్లాస్ పీకారు.
ఈ మాజీ మంత్రి గారు ఆవేశంతో ఏమి చెప్పినా కూడా అన్న మాటలో తప్పు లేదనే అంతా అంటున్నారు. ఊరిలో రోడ్డు బాగులేకపోయినా భవనం నిర్మాణం కాకపోయినా నేరుగా ప్రభుత్వానే నిందిస్తారు. సర్కార్ మీదనే బండ వేస్తారు. మరి లోకల్ గా అధికారులు చేయాల్సిన పనులు వాటిని పర్యవేక్షించాల్సిన ప్రజా ప్రతినిధుల ఉదాశీనత వల్లనే ఇది జరుగుతోంది అని మాజీ మంత్రి సత్యం పలికారు అని అంతా అంటున్నారు.