ఎప్పుడో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకూ, ఇటీవలి అతడి సినిమాకూ ముడిపెట్టారు వీరహిందుత్వవాదులు. దేశంలో అసహనం ప్రబలుతోందని లౌకివాదులు అసహనం వ్యక్తం చేసిన వేళ ఆమిర్ కూడా స్పందించారు. దేశంలో పరిణామాలు తమ కుటుంబంలో భయాన్ని పెంపొందిస్తున్నాయన్నట్టుగా ఆమిర్ అన్నాడు. ఈ దేశాన్ని వీడి మరో చోటికి వెళ్లిపోదామన్నట్టుగా తన భార్య కిరణ్ రావ్ తనతో వ్యాఖ్యానించిందంటూ ఆమిర్ అప్పట్లో చెప్పాడు! అదో దుమారం అయ్యింది. అయితే అప్పట్లో ఆమిర్ సినిమాలను బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద వివాదాలేవీ రాలేదు.
ఆమిర్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత వచ్చిన అతడి సినిమా *దంగల్* భారతీయులకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటయ్యింది. ఆ తర్వాత ఆమిర్ తన సినిమాలు తను చేసుకుంటూ వస్తున్నాడు. ఏమైందో కానీ.. ఇటీవలి అతడి సినిమా నేపథ్యంలో మాత్రం అతడి గత వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు వాళ్లంతా! వాళ్లకు వేరే వివాదం దొరకకపోవడం వల్లనేమో.. ఆమిర్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి, అతడి తాజా సినిమాను బాయ్ కాట్ చేద్దామంటూ వాట్సాప్ యూనివర్సిటీ పని పెట్టుకుంది!
అయితే ఆమిర్ సినిమా వీళ్లు ప్రత్యేకంగా బాయ్ కాట్ చేయనవసరం లేదని, చూద్దామన్నా ఆ సినిమా చూడనివ్వదనే టాక్ నడుస్తోంది. ఇలా వాట్సాప్ యూనివర్సిటీ ప్రయాసగా మారినట్టుగా ఉంది. సినిమా నీరసాన్ని ఇస్తుండటం, ప్రేక్షకుడితో కనెక్ట్ కాకపోవడంతో.. ఎవ్వరి పిలుపుతో పని లేకుండా ఈ సినిమా వైపు ప్రేక్షకులు మొగ్గేలా లేరు. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ ను వాట్సాప్ యూనివర్సిటీ తన విజయంగా చెప్పుకోవచ్చు! తమతో పెట్టుకున్నందుకు ఆమిర్ సినిమా ఫెయిలయ్యిందని గర్వంగా చెప్పుకోగల సత్తా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ కు ఉంది.
ఆ సంగతలా ఉంటే.. ఆమిర్ ఖాన్ హర్ ఘర్ తిరంగాలో పాలుపంచుకున్నాడు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతి ఇంటిలోనూ తిరంగా జెండాను ఎగరేయాలన్న పిలుపుకు అనుగుణంగా ఆమిర్ తన ఇంటి వద్ద జెండాను ఎగరేశాడు! మరి వాట్సాప్ యూనివర్సిటీ దీన్నైనా ఆమోదిస్తుందో లేదో!