ఫ్లాగ్ బేరర్ ఆఫ్ నెపోటిజం.. అంటూ తీవ్రమైన విమర్శలనే ఎదుర్కొంటూ వస్తున్నా.. తన పంథాలో ఎలాంటి మార్పు ఉండబోదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్. కొన్నేళ్లుగా దర్శకత్వంతో కంటే.. నిర్మాతగానే బిజీగా ఉన్న కరణ్ బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లల బాధ్యతలు స్వీకరించినట్టుగా వ్యవహరిస్తున్నాడు.
పలువురు హీరోల కూతుళ్లు, హీరోయిన్ల కూతుళ్లు, హీరోల తమ్ముళ్లు, హీరోల తనయులు.. ఇలా ఎవరైతేనేం.. బాలీవుడ్ సంబంధికుల సంతతిని స్టార్లుగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. వారికే వరస పెట్టి అవకాశాలు ఇస్తున్నాడు. స్టార్ల పిల్లలకు అవకాశం ఇవ్వడానికే అన్నట్టుగా సినిమాలు రూపొందిస్తూ ఉన్నాడు!
ఏం చేసినా, ఎవరితో చేసినా కరణ్ ది కూడా వ్యాపారమే. ఆ వ్యాపారం ఇలా లాభసాటిగా ఉన్నట్టుంది. లాభాలు లేకపోతే స్టార్ల పిల్లలను కరణ్ నెత్తికెత్తించుకున్నా అతడికి మిగిలేది భారమే. దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కరణ్ ను నెపోటిజానికి ప్రతినిధిగా మాత్రమే చూస్తూ విమర్శిస్తూ ఉంటారు. తనపై వచ్చే ఈ విమర్శలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు ఈ బాలీవుడ్ వాలా. తన తదుపరి సినిమాల్లో కూడా బాలీవుడ్ సినీ వారసులే ఉండబోతున్నారని కరణ్ క్లారిటీ ఇస్తున్నాడు.
ఒకేసారి సారా అలీఖాన్ ను రెండు సినిమాల్లో హీరోయిన్ గా బుక్ చేసుకున్నాడు కరణ్ జొహార్. ఆయన నిర్మాణంలో రూపొందబోయే నెక్ట్స్ రెండు సినిమాల్లోనూ సారానే హీరోయిన్ గా నటిస్తుందట. ఇలా బాలీవుడ్ సినీ వారసురాలినే తన తదుపరి ప్రాధాన్యతలో పెట్టుకున్నాడు. సారా అంటే కరణ్ కు పెద్దగా నచ్చదనే ప్రచారమూ ఉంది. ఆమెకు వరసగా రెండు అవకాశాల ద్వారా.. సైఫ్ అలీఖాన్ కూతురుపై కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇప్పటికీ కరణ్ తీరుపై విరుచుకుపడుతూ, నెపోటిజానికి అతడిని ప్రతినిధిగా చూసే వారికి మాట్లాడుకోవడానికి మరింత మసాలాను ఇచ్చాడు ఈ ప్రొడ్యూసర్!