పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి సినిమాల భారీ వసూళ్ల పరంపరతో సౌత్ సినిమాలు జాతీయ స్థాయిలో మరింతగా హాట్ టాపిక్ అయ్యాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ ను డ్యామినేట్ చేస్తున్నాయనే విశ్లేషణ ప్రముఖంగా వినిపించింది.
సౌత్ భాషల నుంచి ఏ సినిమాలు వచ్చినా.. వాటికి పాన్ ఇండియా అనే ట్యాగ్ తోడయ్యింది. బాలీవుడ్ కూడా సౌత్ సినిమాల నుంచి పాఠాలు నేర్చుకోవాలంటూ అక్కడి సినీ విశ్లేషకులు వరస పెట్టి చెబుతూ వస్తున్నారు. అయితే ఇంతలో వరసగా వచ్చిన సౌత్ సినిమాలు మాత్రం వరస పెట్టి ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్నాయి.
గత మూడు నెలల్లో వచ్చిన భారీ సినిమాల్లో కొద్దోగొప్పో బాగా ఆడింది కమల్ హాసన్ 'విక్రమ్' మాత్రమే. ప్రధానంగా తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత మలయాళీలకూ, తెలుగు వారికి నచ్చింది. కానీ హిందీలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేకపోయింది!
ఇక మిగతా సినిమాలు ఇంటాబయటా నెగ్గలేకపోయాయి. తెలుగుకు సంబంధించి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ల 'ఆచార్య', దాని కన్నా మునుపు రాధేశ్యామ్, భారీ అంచనాలతోనే వచ్చిన తమిళ సినిమా బీస్ట్.. ఈ సినిమాలు పాన్ ఇండియా ప్రదర్శన చేస్తాయనుకుంటే ప్రాంతీయ హిట్స్ కూడా నిలవలేకపోయాయి. వీటితో పాటు భీమ్లా నాయక్, సర్కారువారి పాట, మలయాళ సినిమాలు భీష్మపర్వం, హృదయం, జేమ్స్, జనగణమన, కడువా.. ఏ ఒక్కటీ అంచనాలను అందుకోవడం కానీ, పుష్ప, కేజీఎఫ్ 2 వంటి స్థాయి కలెక్షన్లు కానీ, ఆ మాత్రం అటెన్షన్ కానీ పొందలేకపోయాయి!
వీటికి తోడు మిడ్ రేంజ్ సినిమాలు వారియర్, థ్యాంక్యూ వంటివి కూడా వైఫల్యాల బాటనే పట్టాయి. పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటూ.. ప్రాంతీయ సినిమా మీడియా సౌత్ సినిమాలను కీర్తిస్తున్న వేళ .. చోటామోటా సినిమాలను కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ తొడలు చరుకుంటున్న వేళ.. ఏ తేడా లేకుండా ఈ సినిమాలన్నీ అంచనాలను అందుకోలేకపోయాయి. అద్భుతాలను చేయలేకపోయాయి. మరి ముందు ముందు ఈ పాన్ ఇండియా పరంపర ఎలా సాగనుందో!