కరోనాతో దేశ రాజకీయం కూడా కొన్ని రకాల కుదుపులను ఎదుర్కొంటూ ఉంది. కొంతమంది ముఖ్యమంత్రులే సాంకేతిక కారణాల వల్ల పదవులను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గత ఏడాది కరోనా విజృంభించిన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే కొనసాగడం గురించి తర్జనభర్జనలు జరిగాయి.
కరోనా పరిస్థితులను సాకుగా చూపి అప్పట్లో ఉద్దవ్ ను మహారాష్ట్ర శాసనమండలికి నామినేట్ చేయడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ లేట్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. అప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో నిలిచారు ఉద్ధవ్.
కరోనా కాబట్టి.. నామినేషన్లను గవర్నర్ వాయిదా వేస్తారని ముందుగా బీజేపీ నేతలు ప్రకటించేశారు. దీనిపై విమర్శలు వచ్చాయి. అయితే చివరకు ఉద్దవ్ ను మండలికి నామినేట్ చేసి, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అవకాశాన్ని ఇచ్చారు మహారాష్ట్ర గవర్నర్.
అధిష్టానం చేత పదవి నుంచి తొలగించబడిన ఉత్తరాఖండ్ సీఎం రావత్ విషయంలో కూడా కరోనా ఒక కారణంగా కనిపిస్తోంది. అంతే కాదు.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని, వ్యూహాత్మకంగా బీజేపీ వాళ్లు రావత్ చేత రాజీనామా చేయించారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది.
రావత్ ఎంపీ హోదాలో ఉన్నారు. ఆయననే సీఎంగా చేసింది బీజేపీ. దీంతో ఆరు నెలల్లోగా ఆయన ఆ రాష్ట్రంలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికకావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంత వరకూ రెడీ అంటుందో బయటకు స్పష్టత లేని అంశం.
రావత్ కోసం ఎలాగోలా బై పోల్ ను నిర్వహించారంటే, అదే కోటాలో మమతా బెనర్జీ కూడా బయటపడిపోతారు! దేశంలో పెండింగ్ లో ఉన్న ఉప ఎన్నికలన్నింటినీ ఒకేసారి నిర్వహిస్తే.. రావత్ కోసం వచ్చే ఉప ఎన్నికలోనే, మమత కూడా ఏదో ఒక సీటు నుంచి పోటీ చేసి నెగ్గగలదు! మమత అంత తేలికగా నెగ్గడం కమలం పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేని అంశమే.
రావత్ ను తప్పించడంతో ఇక బీజేపీకి ఉప ఎన్నికలతో అవసరం లేదు. కాబట్టి.. సీఈసీ ఇప్పుడప్పుడే ఉప ఎన్నికలను నిర్వహించకపోయినా నష్టం కేవలం మమతకు మాత్రమే! ఈ నేపథ్యంలోనే రావత్ ను తప్పించేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి నవంబర్ నెల వరకూ గడువు ఉంది.
నంబర్ ఐదు లోగా ఆమె ఎమ్మెల్యే హోదాను సంపాదించుకోవాలి. అది జరగాలంటే ఉప ఎన్నికలు జరగాలి. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ ప్రస్తుతానికి ఉప ఎన్నికలను నిర్వహించడం లేదనే ప్రకటన చేస్తే.. మమత తప్పనిసరిగా ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది.
తన వారిని మరొకరిని ఆమె తాత్కాలికంగా సీఎం సీట్లో కూర్చోబెట్టి వ్యవహారాన్ని నడిపించవచ్చు. ఏదేమైనా.. మమతకు చెక్ పెట్టడానికి ముందుగానే రావత్ ను తప్పించారనే అభిప్రాయాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.