ఏపీ బీజేపీపై గ‌రంగ‌రం

ఏపీ సాగునీటి ప్రాజెక్టుల‌ను అడ్డుకునేందుకు తెలంగాణ‌లో రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని పార్టీలు ఏక‌మ‌వుతున్నాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అందుకు పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది.  Advertisement త‌మ‌కు రాజ‌కీయాలే త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వ‌నే రీతిలో…

ఏపీ సాగునీటి ప్రాజెక్టుల‌ను అడ్డుకునేందుకు తెలంగాణ‌లో రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని పార్టీలు ఏక‌మ‌వుతున్నాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అందుకు పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది. 

త‌మ‌కు రాజ‌కీయాలే త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వ‌నే రీతిలో రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆంధ్రా ప్రాజెక్టులు అక్ర‌మమంటూ కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెఖావ‌త్‌కు లేఖ రాయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

మ‌రి ఏపీ బీజేపీ వైఖ‌రి ఏంట‌ని ఆ రాష్ట్ర ప్ర‌జానీకం ప్ర‌శ్నిస్తోంది. రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ పేరుతో గ‌తంలో హ‌డావుడి చేసిన ఏపీ బీజేపీ, ఇప్పుడు ఆ ప్రాంత సాగు, తాగునీటి హ‌క్కుల‌కు భంగం క‌లిగించేలా తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌హ‌రిస్తుంటే ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌నే నిల‌దీత‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటంలో కేసీఆర్‌ విఫలమయ్యారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డు కునే ప్రయత్నం చేయట్లేదని లేఖలో సంజయ్ పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణతో ఏపీ అక్రమప్రాజెక్టులు చేపట్టినా కేసీఆర్‌ అభ్యంతరం చెప్పలేదని సంజయ్‌ తప్పుపట్ట‌డం గ‌మ‌నార్హం.  

రాయలసీమ ఎత్తిపోతల పనులు 50 శాతం పూర్తయ్యాయని కేంద్ర‌మంత్రికి రాసిన లేఖ‌లో బండి సంజ‌య్ ప్ర‌స్తావించారు. రాయ‌ల‌సీమకు తాగునీళ్లు అందించాలంటే పోతిరెడ్డిపాడు ఎంత కీల‌క‌మో బీజేపీ నేత‌ల‌కు తెలియంది కాదు. 

అలాంటప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌రీ విస్త‌ర‌ణతో పాటు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నుల‌ను అడ్డుకోవాల‌ని తెలంగాణ బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంటే, ఏపీ బీజేపీ ఏం చేస్తోంద‌నే ఆక్రోశం రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు ప్ర‌శ్నిస్తున్నారు. 

తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టుల గురించి ఏపీ బీజేపీ నేత‌లు కేంద్ర‌జ‌ల్‌శ‌క్తి మంత్రికి ఎందుకు ఫిర్యాదు చేయ‌డం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను తెలంగాణ బీజేపీకి తాక‌ట్టు పెట్టార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.