దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ తెలంగాణలో స్థాపించనున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది.
తన రాజకీయ అజెండా ప్రకటించడానికి ముందు జెండాను తెలంగాణ ప్రజలకు పరిచయం చేయాలని ఆమె ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణను ప్రతిబింబించేలా పార్టీ జెండాను తీర్చిదిద్దారు.
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగులో జెండాను రూపొందించి తనను తెలంగాణ బిడ్డగా ఆవిష్కరించుకునే యత్నం చేశారు. జెండాలో 80 శాతం మేరకు పాలపిట్ట రంగు, మిగిలిన 20 శాతం నీలం రంగు ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్సార్ చిత్రం ఉండేలా రూపొందించినట్టు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ వెల్లడించారు.
తన తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8న పార్టీని అధికారికంగా ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకను హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ ఆవిర్భావ ఉత్సవానికి సంబంధించి వాల్‌పోస్టర్‌ను ఆదివారం లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు.