తెలంగాణ‌లోనేనా స‌మ‌రోత్సాహం…ఏపీలో ఏదీ?

క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాల ప‌రిధిలోని హుజూరాబాద్ నియోజ‌కవ‌ర్గంలో ఎన్నిక‌ల హ‌డావుడి చూస్తుంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు గుర్తుకొస్తోంది. ఎందుకంటే బ‌ద్వేలులో కూడా ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. బ‌ద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్…

క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాల ప‌రిధిలోని హుజూరాబాద్ నియోజ‌కవ‌ర్గంలో ఎన్నిక‌ల హ‌డావుడి చూస్తుంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు గుర్తుకొస్తోంది. ఎందుకంటే బ‌ద్వేలులో కూడా ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. బ‌ద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య అనారోగ్యంతో మృతి చెందిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బ‌ద్వేలులో కూడా ఉప ఎన్నిక అనివార్య‌మైంది. తెలంగాణ‌లో మంత్రి ఈట‌లను కేసీఆర్ త‌న కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం, ఆ త‌ర్వాత టీఆర్ఎస్ నుంచి ఆయ‌న బ‌య‌టికి రావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వంతో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా ఈట‌ల రాజీనామా చేసి కేసీఆర్‌కు స‌వాల్ విసిరారు. అనంత‌రం బీజేపీలో చేరి హుజూరాబాద్ నుంచి ఎలాగైనా ఏడో సారి గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల, క‌సి ఈట‌ల రాజేంద‌ర్‌లో క‌నిపిస్తోంది.

ఈట‌ల గెలుపును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అడ్డుకోవాల‌నే ప‌ట్టుద‌ల అధికార టీఆర్ఎస్‌లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైంది. దీంతో ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుందో తెలియ‌ని హుజూరాబాద్‌లో ప్ర‌ధాన పార్టీల బ‌లాలు మోహ‌రించాయి. ఊరూరా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. సామాజిక వ‌ర్గాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్‌తో పాటు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న బ‌ద్వేలులో మాత్రం ఎలాంటి ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. బ‌ద్వేలులో వైసీపీ అభ్య‌ర్థిగా దివంగ‌త ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య కుటుంబ స‌భ్యుల‌కే టికెట్ ఇవ్వొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 9న బ‌ద్వేలులో సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థి విష‌య‌మై ఓ స్ప‌ష్ట‌త రావ‌చ్చ‌ని తెలుస్తోంది.  

బ‌ద్వేలులో వైసీపీ బ‌లంగా ఉంది. అక్క‌డ టీడీపీ రోజురోజుకూ బ‌ల‌హీన‌ప‌డుతోంది. బ‌ద్వేలులో పోటీ చేయాల‌నే ఆస‌క్తి కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొర‌వ‌డింది. దివంగ‌త మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి త‌న‌య విజ‌య‌మ్మ పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్న‌ప్ప‌టికీ, క్షేత్ర‌స్థాయిలో ఆమె ఎక్క‌డా ప‌ర్య‌టిస్తున్న దాఖ‌లాలు లేవు. దీంతో టీడీపీలో స్త‌బ్ధ‌త నెల‌కుంది.

ఈ నేప‌థ్యంలో ఎటూ గెల‌వ‌లేమ‌ని టీడీపీ ఉప ఎన్నిక గురించి ఆలోచించ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ఎలాగూ గెలుస్తామ‌నే ధీమాతో వైసీపీ నింపాదిగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి బ‌ద్వేలు ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న వ‌స్తే త‌ప్ప‌, అక్క‌డ రాజ‌కీయ వేడి ర‌గిలే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మొత్తానికి హూజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా స‌మ‌రోత్సాహం క్రియేట్ చేస్తే, ఏపీలో మాత్రం ఆ వాతావ‌ర‌ణ‌మే లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.