రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తరువాత స్థానం విశాఖదే. ఉమ్మడి ఏపీలో కూడా అంతా విశాఖ వైపు చూసేవారు. విశాఖను రెండవ హైదరాబాద్ అని కూడా అనేవారు. ఇదిలా ఉంటే దర్భంగా ఉగ్ర మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలియడంతో విశాఖ కూడా ఉలిక్కిపడుతోంది.
విశాఖ రక్షణ పరంగా వ్యూహాత్మకమైన ప్రాంతం. విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ విభాగాలు కూడా ఉన్నాయి. ఇక ప్రతిష్టాత్మకమైన తూర్పు నావికాదళం కూడా విశాఖలో ఉంది. తీర ప్రాంత రక్షణలో అతి ముఖ్య భూమికను ఈ నావికాదళం పోషిస్తోంది.
ఇదిలా ఉంటే పాక్ భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం రేపుతున్న సంగతి విధితమే. దాంతో పాటు హైదరాబాద్ లో మాలిక్ బ్రదర్స్ అరెస్ట్ వంటి వాటి నేపధ్యంలో విశాఖ అలెర్ట్ అయింది. తూర్పు నావికాదళం ప్రాంతాన్ని నో ఫ్లైంగ్ జోన్ గా నావికాదళ అధికారులు ప్రకటించారు.
అక్కడ అనుమతి లేకుండా ఎలాంటి డ్రోన్లూ ఎగరవేయరాదు అంటూ గట్టి ఆంక్షలు విధించారు. అదే విధంగా తీర ప్రాంతంలో కూడా భద్రతాపరమైన చర్యలను సమీక్షిస్తున్నారు. మొత్తానికి విశాఖ మీద కూడా ఉగ్ర కన్ను పడుతుంది అన్న అనుమానంతో రక్షణ పరంగా అలెర్ట్ అవుతున్నారని తెలుస్తోంది.