కుడి ఎడమలు దగా దగా అన్నాడు మహాకవి. ఏ వైపు అయినా అన్యాయమే అని ఆ కవి భావన. ఇక రాజకీయాల్లో చూస్తే కుడి ఎడమ పార్టీలు ఎప్పటికీ కలవవు అంటారు. వారు సిద్ధాంత బద్ధులని కూడా చెబుతారు. అయితే చిత్రంగా విశాఖలో ఒకే అంశం మీద బీజేపీ, వామపక్షాలు ఆందోళనకు దిగడం విశేషమే.
జీవీఎంసీ పెంచిన ఆస్తిపన్ను తగ్గించాలంటూ రెండు పార్టీలూ జనంలోకి వచ్చాయి. ఇంతదాకా ఓకే అనుకున్నా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే వైసీపీ సర్కార్ ఆస్తి పన్ను పెంచిందని వామపక్ష నేతలు విమర్శించడంతో ఖంగు తినడం కమలం పార్టీ వంతు అవుతోంది.
కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలో భాగమే ఈ ఆస్తి పన్ను పెంపు అని వామపక్షాలు అంటున్నాయి. సంస్కరణలు అమలు చేయకపోతే అదనంగా అప్పులకు అనుమతించకూడన్న కేంద్ర షరతులను వారు ప్రస్థావిస్తున్నారు. మరో వైపు కేంద్రం విధానాల వల్లనే ఆస్తి పన్నులు దేశమంతటా పెరుగుతున్నాయని మేధావులూ అంటున్నారు.
కానీ విశాఖ బీజేపీ మాత్రం వైసీపీ సర్కార్ ఆస్తి పన్ను పెంపు పెంచడాన్ని అసలు ఒప్పుకోమని గర్జిస్తోంది. ఇది మీ పుణ్యమేనని మిగిలిన వారు అంటున్నా వైసీపీ సర్కార్ దే పాపం అని బీజేపీ అంటోంది.
మరో వైపు వైసీపీ కూడా కేంద్ర నిబంధనలు విధానాల మేరకే పన్నులు పెంచామని ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. అంటే బీజేపీది ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాటా అని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి.