ఆంధ్రప్రదేశ్‌కు కరోనా నుంచి విముక్తి చెందే రోజులు దగ్గరే ఉన్నాయి. తాజా కరోనా పాజిటివ్ గణాంకాలు చూస్తే… ఆంధ్రప్రదేశ్ సమాజం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసే ఆనంద క్షణాలు కనుచూపు మేరలోనే ఉన్నాయనే నమ్మకం కలుగుతోంది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 90,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 2,930 మందికి మాత్రమే పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ లెక్కలు చాలు అతి త్వరలో కరోనా నుంచి మనకు విముక్తి కలుగుతుందనే నమ్మకం కలగడానికి. అలాగే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది కరోనాతో మృతి చెందారు.
మరణాలు బాధాకరమే అయినప్పటికీ, అందులో తగ్గుదల కనిపించడం సంతోషకరం. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,346 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35,871 యాక్టీవ్ కేసులున్నట్టు వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ పేర్కొంది.
రానున్న రోజుల్లో మరింతగా కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రజానీకం ఆశతో ఉంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌పై జనంలో ఉన్న అపోహలను తొలగించి, టీకా వేసేందుకు వైద్యారోగ్యశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. దీంతో గిరిజనులు, అణగారిన వర్గాల ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారని సమాచారం.