ప్ర‌ముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు

ప్ర‌ముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు పోకిరీల నుంచి వేధింపులు త‌ప్ప‌లేదు. ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమెపై అస‌భ్య మెసేజ్‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ఆమె సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు…

ప్ర‌ముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు పోకిరీల నుంచి వేధింపులు త‌ప్ప‌లేదు. ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమెపై అస‌భ్య మెసేజ్‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ఆమె సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది. సోష‌ల్ మీడియాలో నైనా జైస్వాల్‌కు గ‌తంలోనూ ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

హైద‌రాబాద్‌లోని కాచిగూడ‌కు చెందిన జైస్వాల్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. భార‌త్‌కు అనేక ప‌త‌కాలు తెచ్చి, మ‌న దేశ జాతీయ ప‌తాకాన్ని ప్ర‌పంచ ప‌టంపై రెప‌రెప‌లాడించారు. ఆట‌లోనే కాదు, చ‌దువులోనూ ఆమె దిట్ట‌. ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే టెన్త్ క్లాస్ పూర్తి చేశారామె. 17 ఏళ్ల నుంచి పీహెచ్‌డీ మొదలుపెట్టింది. రెండు చేతులతోనూ ఒకేసారి రాయగల దిట్ట‌.

మోటివేష‌న‌ల్ స్పీక‌ర్‌గా విశేష గుర్తింపు పొందారు. సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఆమెకు ల‌క్ష‌లాది మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారు. గ‌తంలో ఆమె ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేశారు. ఆమెకు సంబంధం లేకుండా ఫేస్‌బుక్‌లో ఏవేవో వీడియోల‌ను షేర్ చేశారు. అప్ప‌ట్లో సైబ‌ర్‌క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసి వారి ఆగ‌డాల‌ను అరిక‌ట్టారు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెపై అభ్యంత‌ర‌క‌ర మెసేజ్‌లు పెట్ట‌డంతో జైస్వాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌పై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్టు స‌మాచారం. సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖులు వేధింపుల నుంచి త‌ప్పించుకోలేకపోతున్నారు. దీంతో మాన‌సికంగా కుంగిపోతున్న ప‌రిస్థితి. కొంద‌రు బ‌య‌టికి చెప్పుకోలేని నిస్స‌హాయ స్థితి.