Macherla Niyojakavargam Review: మూవీ రివ్యూ: మాచర్ల నియోజకవర్గం

టైటిల్: మాచర్ల నియోజకవర్గం రేటింగ్: 2/5 తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరీన్, సముద్రఖని, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజి, మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు కెమెరా: ప్రసాద్ మూరెళ్ల సంగీతం: మహతి స్వర సాగర్ ఎడిటింగ్:…

టైటిల్: మాచర్ల నియోజకవర్గం
రేటింగ్: 2/5
తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరీన్, సముద్రఖని, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజి, మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్: కోటగిరి 
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి 
దర్శకత్వం: ఎం. ఎస్. రాజశేఖర్ రెడ్డి 
విడుదల తేదీ: 12 ఆగష్ట్ 2022

టైటిల్ కొత్తగా ఉంటే జనం దృష్టి పడుతుంది. ఆ విషయంలో ఈ టైటిల్ ఫుల్ మార్క్స్ వేయించుకుంది. పాటలు బాగుంటే కాస్త ఆసక్తి పెరుగుతుంది. అన్నీ కాకపోయినా “అయాం రెడీ” అనా పాటకి కాస్త అటెన్షన్ వచ్చింది. పక్కా మాస్ మసాలా చిత్రంలో నితిన్ అనగానే జాగ్రత్తగానే చేసుంటారనే నమ్మకం కలిగింది. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం. 

అన్నం మెతుకు చూస్తే ఉడికిందో లేదో చెప్పొచన్నట్టుగా చాలా సందర్భాల్లో సినిమా మొదలైన తీరు, తొలి రెండు మూడు సీన్లు నడిచే పద్ధతి చూస్తే సినిమా గట్టెక్కబోతోందో లేదో తెలిసిపోతుంది. 

బీచ్ లో చెడ్డీ వేసుకుని తిరిగే హీరోయిన్. ఆమెను చుట్టుముట్టి ఈవ్ టీజింగ్ చేసే రేపిష్టుల్లాంటి రౌడీలు. సరిగ్గా ఆ అమ్మాయిని ముట్టుకునే టైముకి గాల్లోకి ఎగిరిపోయే రౌడీ. కమ్మేసిన దుమ్ములోంచి రివీలయ్యే హీరో. ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్ సాంగ్. 

ఈ సీన్ ఏ సినిమాలోదో చెప్పమంటే సుమారు కొన్ని వందల సినిమాలు చెప్పొచ్చు. 1990ల నాటి ఇలాంటి ఓపెనింగ్ తో సాగే ఈ కథలో ఎక్కడా మెరుపులుండవు. అంతా ప్రెడిక్టిబుల్ గా నడుస్తుంది. ఒక్కో చోట తర్వాత ఏమౌతుందో తెలుసుకుందామనే ఉత్సాహం కూడా పోయి కాసేపలా కునుకు తీద్దామనిపిస్తుంది. 

చాలా లో-ఐక్యూలో ఉన్న కథని అంతకంటే లో-ఐక్యూ ఉన్న ఆడియన్స్ కోసం సినిమాగా తీసినట్టుంది. 

ఒక ఫైటు, వెంటనే పాట, ఆ వెంటనే కమెడియన్ ఎంట్రీ, మధ్యలో విలన్ ట్రాక్…చివరికి హీరో విలన్ని మట్టికరిపించడం. ఇంతకు మించి ఇందులో చెప్పుకోవడానికి ఏదీ లేదు. కథో, కథనమో, నేపథ్యసంగీతమో, పాటలో, స్టంట్సో..ఇలా ఏదో ఒక దాని గురించైన అద్భుతమని చెప్పుకోవడానికి లేని సినిమా ఇది.

అన్నిటికంటే మించి లో బడ్జెట్ సి-గ్రేడ్ సినిమా లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మహతిస్వరసాగర్ నుంచి రావడం ఆశ్చర్యకరం. నిజంగా ఇది మణిశర్మ వారసుడి పనితనమేనా లేక ఇంకెవరికన్నా ఔట్ సోర్సింగ్ ఇచ్చాడా అన్నంతగా ఉన్నాయి కొన్ని సీన్లకిచ్చిన బ్యాక్ గ్రౌండ్ చూస్తే. 

“అయాం రెడీ” పాటకొక్కదానికీ హాల్లో స్పందన కనిపించింది. మిగిలిన పాటలన్నీ పరమ రొటీన్ గా ఉండి ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉన్నాయి. 

మినిష్టర్ కూతురు ఏ రక్షణా లేకుండా రోడ్డు మీద చెడ్డీలు వేసుకుని తిరగడం, కలెక్టరైన హీరో ఏ పోలీసు సాయం లేకుండా హై వోల్టేజ్ ఫైట్లు చేసేయడం లాంటి సీన్లు ఇప్పటి ఆడియన్స్ కి ఎక్కవుగాక ఎక్కవు. ఒకవేళ ఎక్కించాలనుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా పండించి ప్రయత్నించాలి. ఎలా పడితే అలా చేసేస్తే చూసేసి మెచ్చేసుకోవడానికి ప్రేక్షకులు రెడీగా లేరు. 

పాటల్ని మాత్రం అందంగా తెరకెక్కించారు. అలా తెరకెక్కించడంలో పెట్టిన శ్రద్ధలో సగం మ్యూజిక్ మీద పెట్టున్నా బాగుండేది. 

కెమెరా వర్క్, నితిన్, ఒక ఐటం సాంగ్ తప్ప మిగిలిన అన్ని విభాగాలకి బొటనవేలుని కిందకి తిప్పి చూపించాల్సిందే. 

పేలవమైన స్క్రిప్ట్ తో మాస్ హీరోగా నితిన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పవర్ఫుల్ మాస్ హీరోగా నిలబడాలన్న తన కల నెరవేరాలంటే జిమ్ములో కంటే స్క్రిప్ట్ మీద బాగా కసరత్తు చేసి దిగాలి. సరైన టెక్నికల్ టీం కూడా తోడవ్వాలి. 

డబులాక్షన్లో సముద్రఖని స్క్రీన్ ప్రెజెన్స్, వాడిన డబ్బింగ్ వాయిస్ పర్ఫెక్ట్ గా ఉన్నా పాత్రని మలచిన తీరులో బలం లేక తేలిపోయాడు. 

క్యాథరీన్ బాగా లావుగా ఉండి ఎబ్బెట్టుగా కూడా అనిపించింది. నితిన్ పక్కన అక్కలా ఉంది తప్ప హీరోయిన్లా లేదు. కృతి శెట్టి పర్వాలేదు. మాస్ హీరోయిన్ గా నిలబడడానికి ఆమె బలవంతంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది…ముఖ్యంగా పాటల విషయంలో. ఆమె ముఖారవిందానికి, వేసే కొన్ని స్టెప్పులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. 

వెన్నెల కిషోర్ కామెడీ “అతి”కి కేరాఫ్ అడ్రస్ గా ఉంది. గుంతలకిడి గుర్నాథం అనే పేరు కూడా పాతచింతకాయలా ఉంది. 

శుభలేఖ సుధాకర్ ని జూనియర్ ఆర్టిస్టు మాదిరిగా వాడుకున్నారు తప్ప సరైన డయలాగ్ ఒక్కటి కూడా రాయలేదు. నరేందర్- సురేందర్ అనుకుంటూ మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ పలకరించుకోవడాన్ని కూడా కామెడీ అనుకోమంటే రచయిత, దర్శకుడు అసలేమనుకున్నారా అనిపిస్తుంది. 

డయలాగ్స్ లో అస్సలు మెరుపుల్లేవు, బలమైన కౌంటర్స్ లేవు, గుర్తుంచుకునే పంచుల్లేవు. మాస్ కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు ఈ దినుసులన్నీ తప్పనిసరి. లేకపోతే సీన్లు చప్పగా ఉండి మాస్ ప్రేక్షకులకి నీరసం తెప్పిస్తాయి.  

వాస్తవానికి దూరంగా, అతి కి దగ్గరగా, నీరసానికి చేరువగా ఉన్న ఈ చిత్రం నితిన్ చిత్రమాలికలో ఒక వాడినపూవులా మిగిలిపోయేలా ఉంది.

బాటంలైన్: డిపాజిట్లు గల్లంతు