మాజీ ముఖ్యమంత్రి వివేకా కూతురు డాక్టర్ సునీతలో చివరికి ఆ ఒక్క ఆశ కూడా చచ్చిపోయినట్టుంది. తన తండ్రి హత్య కేసును సీబీఐ విచారిస్తే దోషులెవరో బయటికి వస్తారని ఆమె మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు. తన అన్న వైఎస్ జగన్ ఏలుబడిలోని దర్యాప్తు అధికారులపై ఆమెకు నమ్మకం లేకపోయింది. దీంతో న్యాయపోరాటం చేసి మరీ సీబీఐతో విచారణ చేయించేలా విజయం సాధించారు.
అయితే విచారణ సంస్థలు మారాయే తప్ప, తండ్రి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని డాక్టర్ సునీత ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ సంస్థ కాకుండా, కేంద్ర ప్రభుత్వ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారణ చేపట్టిందనే ఆనందమే తప్ప, దాని వల్ల ఒరిగేదేమీ లేదనే వాస్తవం తెలుసుకోడానికి ఆమెకు కొంత సమయం పట్టింది.
సీబీఐపై కూడా నమ్మకం కోల్పోయిన నేపథ్యంలో తాజాగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐని కూడా ప్రతివాదిగా చేర్చడం గమనార్హం. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ఆమె తీసుకెళ్లారు.
సీబీఐ దర్యాప్తు అధికారులపైనే నిందితులు కేసులు పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సీబీఐ విచారణ వల్ల అసలు దోషులెవరో తేలుతుందన్న విశ్వాసాన్ని ఆమె కోల్పోయారని పిటిషన్ ద్వారా వెల్లడవుతోంది. సునీత అనుమానిస్తున్న పెద్ద తలకాయలపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఆమె అసహనానికి కారణమని తెలుస్తోంది. సునీత పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా వ్యవహరిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకుంది.